Rayadurgam Lands | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం’ కాళోజీ నినాదం ఇది. పొలిమేర దాటిన ప్రాంతేతరులు ఇప్పుడు ప్రాంతం వాళ్లను కలుపుకొని మళ్లీ వచ్చారు. రాయదుర్గం కొండకు కన్నం పెట్టారు. రూ. 10 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా పప్పు బెల్లాల్లా పంచుకొని బిగ్‌షాట్‌కు బేరం పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, పల్నాడు జిల్లాలకు చెందిన నేతలు ఇందులో పాత్రధారులు కాగా, తెలంగాణ కీలక మంత్రి ఇందులో సూత్రధారిగా ఒప్పందాలు జరిగినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 99 ఎకరాల ప్రభుత్వ భూమిని బిగ్‌షాట్‌కు విక్రయించేందుకు జరిగిన ఒప్పందాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. ఆదివారం (24న) ‘మంత్రి కనుసన్నల్లో బిగ్ భూ దందా!’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ భూమికి ప్రైవేటు పట్టాలు పుట్టించి, అంతర్జాతీయ స్థాయిలో పేరుకున్న గుజరాత్ వ్యాపారికి విక్రయించే కుట్రను ‘నమస్తే’ వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడీ కథనం ఇటు తెలంగాణ, అటు ఏపీలో ప్రకంపనలు రేపుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ కథనం చదివిన పలువురు పాఠకులు ఫోన్ చేసి ఈ వ్యవహారానికి సంబంధించి తమ వదనున్న సమాచారాన్ని, అందుకు సబంధించిన డాక్యుమెంట్లను అందించారు. పాఠకులు పెట్టిన పొగతో రాయదుర్గం కొండల నుంచి అనకొండలే బయటికి వస్తున్నాయి.
విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రకచర్ ప్రైవేట్ లిమిటెడ్, భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరు మీద ఒప్పందం చేసుక్ను భూములే బిగ్ భూదంతాలో కీలకం.‘భావన’ పేరుపై 125 ఎకరాలకు సంబంధించిన అగ్రిమెంట్ ఉంది. ఈ రెండు సంస్థలకు ఈఆర్కే రావు యజమాని అని తేలింది. ఈయన మాజీ ఎంపీ భర్త అని చెప్తూ ‘నమస్తే’కు పాఠకులు సమాచారం ఇచ్చారు. పైన చెప్పిన రెండూ బోగస్ సంస్థలేనని 2014లో అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం చంపాలాల్ తేల్చిచెప్పారు. భావన సొసైటీ సేల్‌డీడ్ దస్తావేజులు బోగస్ అని నిరుడు సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్న 23 ఎకరాల భూమిని పంజాబ్ నేషనల్ బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు కాగా, విచారించిన సీబీఐ కోర్టు పీఆర్కే రావు, ఆయన భార్యకు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది.
ధరణి రికార్డుల్లో సర్వే నంబర్ 83/2లోని 99.06 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై చూపెడుతున్నది. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ భూమి మ్యుటేషన్, ఆధార్ అనుసంధానం కానట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపెడుతున్నది. అప్పటి ఏపీఐఐసీ (ప్రస్తుత టీజీఐఐసీ) ఈ భూములపై కేసు వేసింది. అలాగే, టీపీసీసీ మాజీ నాయకుడి కుమార్తె ప్రైవేట్ సూట్ వేసింది. కోర్టు కేసుల నుంచి వీరిద్దరూ వైదొలగితే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న రుక్నుద్దీన్, అజీజ్ ఫాతిమా, అబ్దుల్ అజీజ్‌లకు అధికారికంగా భూ యాజమాన్య హక్కులు లభిస్తాయి. రుక్నుద్దీన్ 1976లో రామస్వామికి జేపీఏ చేయగా, ఆయన 1982లో భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి భూమిని విక్రయించినట్టు సేల్‌డీడ్ ఉంది. దీంతో ఆటోమెటిక్‌గా పీఆర్కే రావు సంస్థల మీదికి భూమి మ్యుటేషన్ అవుతుంది.
ఈ వివాదంలోకి దూరిన కీలక మంత్రి, ముఖ్యనేత సోదరుడిని ఇందులో కలుపుకొని, బోగస్ కాగితాలకు చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకున్నారని చెప్తున్నారు. ‘భావన’లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని పిలిపించి ‘సెట్’ చేసే పనిని ముఖ్యనేత సోదరుడికి అప్పగించినట్టు పాఠకులు ఆధారాలతో సహా సమచారం ఇచ్చారు. ఈ రెండు పనులు చేసిపెట్టినందుకు ఇద్దరూ కలిపి 16 ఎకరాల భూమి రాయించుకున్నట్టు సమాచారం. బోగస్ దస్తావేజులకు చట్టబద్ధత కల్పించే తొలి ప్రయత్నంలో భాగంగా టీజీఐఐసీ నుంచి సర్వే నంబర్ 83/2 లోని భూమి తమది కాదని ఎన్వోసీ(నిరభ్యంతర పత్రం) తీసుకున్నారు. అయితే, మాజీ ఎమ్మెల్యే భార్య టీజీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక ఎన్వోసీ తీసుకుంటే ఆమె భర్తకు కూడా ఇందులో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఆమె బాధ్యతలు స్వీకరించడానికి 10 రోజుల ముందే ఎన్వోసీ తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో ప్లాట్ల యజమానులను పిలిపించిన ముఖ్య నేత సోదరుడు వారి చేతిలో అంతోఇంతో పెట్టి సేల్డీడ్లు తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు, పల్నాడు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అప్పట్లో 8 కోట్లు ఖర్చు చేసి 5 ఎకరాలు రాయించుకున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేందుకు తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారికి రెండెకరాలు రాసిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 83/2 సర్వే నంబర్ ప్రైవేటు భూమి అంటూ అడ్వకేట్ జనరల్‌తో అఫిడవిట్ తీసుకున్నారు. అలా ఇచ్చినందుకు రెండెకరాలు ఇస్తామని చెప్పగా, ఇవ్వాలనుకుది డబ్బు రూపంలో ఇవ్వాలని ఆయన కోరడంతో రూ. 50 కోట్లకు డీల్ ఓకే అయినట్టు పాఠకుల లాగిన కూపీలో వెల్లడైంది.
ఈ డీల్ కుదరడానికి నెల రోజుల ముందు తెలంగాణలోని కీలక వ్యక్తుల ఇండ్లలో ఈడీ సోదాలు జరిగాయి. తనిఖీల అనంతరం ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలు పట్టుకుపోవడంతో పాటు, భారీగా నగదును పట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఈ బిగ్ డీల్ కోసం మాజీ ఎంపీ బయ్యర్‌ను తెచ్చినట్టు తెలిసింది. మన్యం జిల్లాలో బాక్సైజ్ ఖనిఖాల వెలికితీత ప్రాజెక్టు పనులు చేపట్టిన సమయంలో బిగ్‌షాట్‌కు, మాజీ ఎంపీకి మధ్య పరిచయం అయినట్టు తెలిసింది. ఆ పరిచయంలోనే ఆయనను హైదరాబాద్‌కు రప్పించి, ప్రముఖ హోటల్లో కూర్చోబెట్టి రాయదుర్గం భూముల కొనుగోలుకు ఒప్పించినట్టు సమాచారం.