Mission Kakatiya | నాడు.. తెలంగాణలో ఎక్కడ చూసినా చుక్కనీరులేక పడావువడ్డ భూములు. చేతినిండా పనిలేక వలసపోయిన ఊళ్లు.. నేడు.. స్వరాష్ట్రంలో కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన మిషన్ కాకతీయ పథకంతో ఊరొక ఊట చెలిమె అయ్యింది. ప్రతి పల్లె కనుచూపు మేర పరుచుకొన్న పచ్చదనంతో కొత్త అందాలను సంతరించుకొన్నది. వలసెళ్లిన ఊళ్లలో బతుకు సంబురం నెలకొన్నది. మిషన్ కాకతీయ పథకం ప్రారంభించి నేటికి 9 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల కుట్రలతో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. పూడిక చేరి, కట్టలు కరిగి.. నిల్వ నీరు లేకుండా బోసిపోయింది. తెలంగాణ పల్లె బతుకు ఛిద్రమైంది. పల్లెజీవనం పట్నాలకు వలస కట్టింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ అంశం ఉద్యమ నినాదమైంది. దీంతో స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలిప్రాధాన్యతగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల లెక్క తేల్చారు. మొత్తంగా 46,531 చెరువులున్నట్టు గుర్తించారు. చెరువుల కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని నిర్ధారించడంతోపాటు ప్రతి ఏటా 20 శాతం పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటివరకూ నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరించారు. ప్రస్తుతం 5వ దశలో భాగంగా మిగిలిన చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు చెరువులకు సంబంధించి పనులు ప్రారంభించారు. మిషన్ కాకతీయ పథకం ఇప్పుడు 9 ఏండ్ల కాలంలోనే అద్భుత ఫలితాలను అందిస్తున్నది. ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భజలాల మట్టం పైపైకి వచ్చింది. మత్స్య పరిశ్రమ గణనీయ వృద్ధిని సాధించింది. జీవాలు, పాడిపశువులకు నీళ్ల కొరత లేకుండా పోయింది. పూడిక మట్టిని పంటపొలాలకు తరలించడం మూలంగా దిగుబడి గణనీయంగా పెరిగిందని అనేక పరిశోధనలు నిగ్గుతేల్చాయి. నీటి వనరుల వృద్ధితో తెలంగాణ క్రమంగా పూర్వవైభవాన్ని సంతరించుకొన్నది. పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతుండగా రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గిపోతున్నాయి. ఏటికేడు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా పెరుగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మిషన్ కాకతీయ పథకం పల్లెకు జీవం పోయడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమిస్తున్నది. ఈ పథకం ఫలితాలపై యావత్ దేశమే ప్రశంసలు కురిపిస్తున్నది. నీటిరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు వేనోళ్ల కొనియాడుతున్నారు. అలాగే, అనేక రాష్ర్టాలు మన మిషన్ కాకతీయ పథకాన్ని ఆదర్శంగా తీసుకొంటుండటం గర్వకారణం. ఇటీవలే పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, రాజస్థాన్ అధికారులు స్వయంగా వచ్చి మిషన్ కాకతీయ పథకం ఫలితాలను తెలుసుకోవడం విశేషం. నీటి వనరుల సంరక్షణ, చెరువుల పరిరక్షణ అంశంలో ఇప్పుడు యావత్తు దేశానికే ఈ పథకం దిక్సూచిగా నిలుస్తున్నది.
మిషన్ కాకతీయ ఆశయాన్ని నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ మరో బృహత్తర ఆలోచన చేశారు. చెరువులకు శాశ్వత జలకళను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. అందులో భాగంగానే ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించారు. మొత్తంగా ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలోని 20 వేలకుపైగా చెరువులను ప్రాజెక్టులతో లింక్ చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే అందులో 10 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులకు లింక్‌చేసి, నదీ జలాలతో నింపుతున్నారు. ఫలితంగా కమాండ్ ఏరియాలోని ప్రతి వాగుపైనా భూగర్భజలాలు పెరుగుతుండటంతోపాటు మత్స్య, పాడి పరిశ్రమ ఇలా మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నారు. చెరువులను నింపడంలో సీఎం మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టే కీలకభూమిక పోషిస్తున్నది. మూడేండ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రూపురేఖలను మారుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భారీ జలాశయాలను నిర్మించడంతోపాటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను లింక్ చేశారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. అలాగే, వాటి కింద ఉన్న చెరువులు నిండుకుండల్లా మారిపోయాయి. ఇప్పటికే 46 వేలకు పైగా చెరువుల్లో దాదాపు 20 వేలకుపైగా అనుసంధానించి.. నిరంతరం నీరుండేలా చూస్తున్నారు. వరంగల్ జిల్లాలో చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, లక్నవరం, పాకాలవంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదులలో భాగం చేశారు. అలాగే, ఖమ్మం జిల్లాలోనూ సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలతో లింక్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వాటి పరిధుల్లోని చెరువులను ఏడాది పొడవునా నింపుతున్నారు. ఫలితంగానే సాగు విస్తీర్ణంలో తెలంగాణ రికార్డు నమోదు చేస్తున్నది.
భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానించడంతో చెరువుల కింద రెండు పంటలకు పూర్తి భరోసా లభిస్తున్నది. చెరువుల కింద ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. తెలంగాణలోని 46,571 చెరువుల కింద 25,92,437 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు ఉంది. పూర్వ కాలంలో చెరువులన్నీ జలకళతో ఉట్టిపడేవి. అందుకే ఇంత భారీ విస్తీర్ణంలో పంటలు సాగయ్యేవి. కానీ ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అది క్రమేణా తగ్గుతూ వచ్చింది. మొత్తంగా చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆయకట్టు కూడా వెలవెలబోయింది. 2008-09 నుంచి ఏడాదికి సరాసరిన 5-6 లక్షల ఎకరాలకు మించి సాగుకాని దుస్థితి. అదీ సమృద్ధిగా వర్షాలు కురిసిన సందర్భాల్లోనే. యాసంగిలో అయితే మరీ నామమాత్రం. మిషన్ కాకతీయ పథకం అనంతరం చెరువుల్లో 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరుగగా, ఏకంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. అదే సమయంలో చెరువులను ప్రాజెక్టులకు లింక్ చేయడం వల్ల ఆయకట్టుకు పూర్తి భరోసా లభించింది. గతంలో 2014-15లో చెరువుల కింద వానకాలం, యాసంగి పంటల సాగు విస్తీర్ణం 6,95,575లు కాగా, ఈ ఏడాది ఏకంగా సుమారు 18 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుండటం విశేషం. ప్రాజెక్టులతో అనుసంధానించడం ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు యాసంగిలో నీటి భరోసా లభించింది. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం మొత్తంగా పూర్తయితే గతంలోని పూర్తిస్థాయి ఆయకట్టుకు రెండు పంటలకు భరోసా లభించనున్నది.
ఎప్పుడో 20 ఏండ్ల కింద కాలువలు తవ్విన్రు. అయినా నీళ్లు ఇచ్చింది లేదు. కేసీఆర్ సార్ నిర్మించిన కాళేశ్వరంతో మా కష్టాలు పోయినయ్. కెనాల్‌కు ఠంచన్‌గా నీళ్లు ఇడుస్తున్నరు. చెరువులను నింపుతున్నరు. ఎండిపోవుడనే ముచ్చట లేకుంటయింది. ఇప్పుడు ఎక్కడ జూసినా నీళ్లంటే నీళ్లు. శెర్వు నిండుగ ఉండవట్కనే తాళ్లు జోరుగా పారుతున్నయ్. రోజుకు నాకు 10 బాటిళ్ల కల్లు అయితంది. వెయ్యికి తక్కువగాకుండా సంపాయించుకుంటున్న.
– గోపగాని శ్రీనివాస్‌గౌడ్, తిర్మలాపూర్ (చిట్యాల, భూపాలపల్లి జయశంకర్ జిల్లా)
కట్నం కింద మా మామ నాకు పది ఆవులు ఇచ్చిండు. ఇప్పుడు నా దగ్గర 200 ఆవులున్నయ్. తెలంగాణ రాకముందు ఆవులకు నీళ్లకు, మ్యాతకు మస్తు తిప్పలుపడ్డ. నీళ్లు లేక ఎక్కడా ఇంత గరికపోసగూడ ఉండకపోయేది. మా తారుపల్లి నుంచి 70 కిలోమీటర్ల దూరంల ఉన్న రామగిరి ఖిల్లాకు కొట్టుకుపోయేటోన్ని. ఏడన్న బాయిలళ్ల నీళ్లు కళ్లవడితే బంగారం దొరికినట్టు సంబురపడేటోళ్లం. కేసీఆర్ సర్కారు వచ్చినంక ఆ తిప్పలన్నీ తప్పినయ్. శెర్లు, కుంటలు మంచిగయినయ్. గోదారి ఎత్తిపోసుడు మొదలు వెట్టినసంది ఏ శెర్వు జూసినా, కుంట జూసినా నీళ్లే. ఎటుచూసినా పచ్చగ కనవడుతున్నది. ఇప్పుడు మా వూరికి దగ్గర పట్లనే ఉన్న ఖాళీ జాగల్ల మంద పెడుతున్న. ఇప్పుడు మంచిగనిపిస్తంది.
– సంగని సంపత్, తారుపల్లి (కాల్వశ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా)