హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): నూనెగింజలు, ఆయిల్‌పాం విత్తనాల ఉత్పత్తి విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని, నిధుల విడుదలలో చిన్నచూపు చూస్తున్నదని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షను లోక్‌సభలో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండగా, కేంద్రం మాత్రం నిధులు సక్రమంగా కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నదని ధ్వజమెత్తారు. ఆయిల్ సీడ్స్, ఆయిల్‌పాం ప్రాయోజిత పథకాల నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని నామా విమర్శించారు. 2018 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కేటాయించి, విడుదల చేసిన నిధుల్లో తీవ్ర వివక్ష చూపించారని పేరొన్నారు. 2022-23లో ఆయిల్సీడ్స్కు సంబంధించి పైసా ఇవ్వలేదని ఆక్షేపించారు.