హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కమ్మ జాతిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్టే కమ్మ సామాజికవర్గానికి కూడా మంచి గుర్తింపు ఇచ్చారని గుర్తుచేశారు. అనేక మంది కమ్మ నేతలకు టికెట్లు ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించారని అన్నారు. కాంగ్రెస్ కమ్మ నాయకులకు ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకొచ్చారా? అని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో తుమ్మల నాగేశ్వర్రావు సత్తుపల్లిలో మూడుసార్లు గెలిచి అకడ ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టలేదని విమర్శించారు. ఖమ్మంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తాము పెట్టామని, ఎన్టీఆర్ చరిత్ర లిఖించిన గ్రానైట్ ఫలకాలను సైతం వారు తొలగించారని మండిపడ్డారు.
ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ అవకాశాల కోసం అన్ని పార్టీలు తిరిగిన వారు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని, సామాజిక వర్గం మొత్తం తనవైపే ఉన్నదని చెప్పడం సరికాదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణభవన్‌లో గురువారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే తాతా మధు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కమ్మ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వీరాభిమాని గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఎన్నికలో మాగంటి సునీతకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని, మూడుసార్లు గోపీని ఆదరించినట్టే సునీతను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు.
1983 నుంచి చివరి వరకు ఎన్టీఆర్ వెంట ఉన్న నేత మాగంటి గోపీనాథ్ అని గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల్ల పాలనలో హైదరాబాద్‌తోపాటు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. రెండేండ్ల్ల కాంగ్రెస్ పాలన ఎలా సాగుతుందో అందరమూ చూస్తున్నామని తెలిపారు. రామోజీరావును అరెస్టు చేయడానికి మఫ్టీలో ఏపీ పోలీసులు వచ్చారని తెలిసి కేసీఆర్ అంగీకరించలేదని, తన రాష్ట్రం నుంచి ఎవరినీ అరెస్టు చేయరాదని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. రామోజీరావు ఇంటిపై చేయి పడకుండా కేసీఆర్ చూశారని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్‌లో గెలవబోమని కాంగ్రెస్ కార్యకర్త మొదలు సీఎం రేవంత్‌రెడ్డి వరకు అర్థమైపోయిందని ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. ఏం చేయాలో పాలుపోక మతం, కులం పేరుతో నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులానికి, రాజకీయ పదవులకు సంబంధం లేదని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తానే గ్లాడియేటర్‌ను అని చెప్పుకుంటున్నారని, కానీ, తుమ్మల ఓడిపోయి పామాయిల్ తోటలో పడుకుంటే కేసీఆర్ పిలిచి మంత్రివర్గంలో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. స్థాయిని పకన పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రాజకీయం చేయడం తుమ్మలకు తగదని అన్నారు.
మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే కూడా మంత్రి తుమ్మల చిల్లరగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. సునీతాగోపీనాథ్కు అందరి దీవెనలు ఉన్నాయని ఆమె గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించవద్దని అడ్డుకున్న నేతలను పకన పెట్టుకొని మైత్రీవనంలో పెడతామని మాట్లాడితే ఎవరూ నమ్మబోరని స్పష్టంచేశారు. ఎన్టీఆర్‌పై అత్యంత అభిమానం ఉన్న నాయకుడు కేసీఆర్ అని, తన కుమారుడికి కూడా తారకరామారావు అని పేరు పెట్టారని గుర్తచేశారు. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన సామాజిక విప్లవం తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్ణం అయిందని చెప్పారు.
మాగంటి గోపీనాథ్ అందరి వాడని, కులమతాలకు అతీతంగా ఆయనను ఆదరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్‌రావు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే గోపన్న తమకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే, ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఎక్కడ ఉండేవారిని ప్రశ్నించారు. ఈనెల 11 కారు గుర్తుకు ఓటేసి జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి సునీతాగోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.
అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్లే కమ్మ సామాజికవర్గానికి కూడా కేసీఆర్ మంచి గుర్తింపు ఇచ్చారని, రాజకీయంగా, అన్ని రంగాల్లోనూ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గుర్తుచేశారు. సినీ నటుడు కృష్ణ చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పిన మహనీయుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇవాళ ఉప ఎన్నిక వచ్చిందని ఎన్టీఆర్ విగ్రహం పేరిట కొందరు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ పట్ల గోపీనాథ్ ఎంత విశ్వాసంగా ఉన్నారో, కేసీఆర్ పట్ల అంత కంటే ఎకువగా ఉన్నారని చెప్పారు.
తనను పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారని అయినా చివరి వరకు కేసీఆర్‌తోనే ఉంటానని వారికి చెప్పానని గోపీనాథ్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. గోపీనాథ్ చనిపోయినపుడు కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుడు కోల్పోతే ఎంత బాధపడతారో అంత బాధ పడ్డారని చెప్పారు. కమ్మవారికి కేసీఆర్ సినిమారంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా చోటు కల్పించారని అన్నారు. ఈ కష్ట సమయంలో మాగంటి సునీతాగోపీనాథ్కు కమ్మ సమాజం అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు.