Kaloji Award | హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నది. కాళోజీ మరణానంతరం ఆయన పేరిట ఏటా ఆయన జయంతిరోజున బీఆర్ఎస్ ఇస్తూ వచ్చిన కాళోజీ పురస్కారాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తున్నది. ఈ పురస్కారానికి 2024లో ఎంపిక జరిగినా అవార్డు ఇవ్వకుండా సాహితీలోకాన్ని చిన్నచూపు చూస్తున్నది. దీంతో సాహితీప్రియులు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఏటా కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9న అవార్డు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. గత ఏడాది కూడా అవార్డు కోసం ప్రభుత్వం ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ పేరును ప్రకటించింది. అయినా కాళోజీ జయంతి రోజున అవార్డును మాత్రం ప్రదానం చేయలేదు. కాళోజీ తెలంగాణ భాషకు, సంస్కృతికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి రోజును ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా జరుపుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2015 నుంచి ఏటా ప్రముఖ సాహితీవేత్తను ఒకరిని ఎంపికచేసి వారికి కాళోజీ పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ అవార్డును ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అవార్డు కింద రూ.జ్ఞాపికతోపాటు రూ.1,01,116 నగదు బహుమతిని అందిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2023 వరకు తెలంగాణలో ఉత్తమ సాహితీవేత్తలను ఈ అవార్డుతో సత్కరిస్తూ గౌరవిస్తూ వచ్చింది.
2024 సంవత్సరానికిగాను కాళోజీ అవార్డు ఎంపిక కోసం ప్రభుత్వం ప్రముఖ కవి అందెశ్రీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌ను అవార్డుకు ఎంపికచేసింది. సెప్టెంబర్ 7న భాస్కర్ పేరును ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 9న కాళోజీ జయంతి రోజున అవార్డు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాళోజీ అవార్డుపై ప్రభుత్వ వైఖరి ఏమిటనేది అంతుబట్టడంలేదు. భవిష్యత్తులో ఈ అవార్డు ఉంటుందా? ఉండదా? ఈ ఏడాదైనా ప్రకటిస్తారా? లేక ఈ ఏడాది అవార్డుతోపాటు నిరుడు ఎంపికచేసిన వారికి కూడా ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉన్నది. దీనిపై భాషా, సాంస్కృతిక శాఖ అధికారులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాసర్కు 14 భాషల్లో పట్టు ఉన్నది. తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక వంటి సంకలనాలను ఆయన ఆవిషరించారు. వివిధ భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించడంతోపాటు తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. మలయాళ నవల స్మారక శిశిగల్ను తెలుగులోకి స్మారక శిలలు పేరిట అనువదించారు. ఈ పుస్తకానికి 2013లో అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.