ఎడారి పల్లెల్లో తడారని కన్నీళ్లు ఒకప్పటి నల్లగొండ బతుకు. ‘ఈ కరువుని పారదోలుతామ’ని హామీల వర్షం కురిపించిన నేతలు బడ్జెట్ కాగితాల్లో కాలువలు పారిస్తున్న కాలంలో… బోరుబావులు పాతాళగంగని పైకి తీసి, భూమి పొరల్లోని ఫ్లోరైడ్ భూతాన్ని నిద్రలేపాయి. ఏ గడపకు పోయినా ఒకరో, ఇద్దరో ఫ్లోరోసిస్ పీడితులే. ‘మాకెందుకీ శిక్ష?’ అని ప్రశ్నించే వీళ్లంతా చేసిన నేరం ఒక్కటే. అయిదేళ్లకోసారి వచ్చే ఓట్ల జారతలో మళ్లీ మళ్లీ మోసపోవడమే. ‘ఏ తప్పూ చేయని, కడుపులోని బిడ్డలకు శిక్ష వేశా’మని ఫ్లోరైడ్ పల్లెల్లో తల్లడిల్లే తల్లుల ఆవేదన చూస్తే గుండె కరిగిపోతుంది. ఈ ప్రపంచంలో.. గుక్కెడు మంచినీళ్ల కోసం దశాబ్దాలు పోరాడిన చరిత్ర ఒక్క నల్లగొండ జిల్లా ప్రజలదే.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘నల్లగొండ నేలపై కృష్ణమ్మను పారించాలె. ఫ్లోరైడ్ని బొంద పెట్టాలె’ అన్న కేసీఆర్.. చెప్పిన మాటప్రకారం మహమ్మారిని ఉరికించి కొట్టారు. ‘పల్లెపల్లెకు భగీరథ పైపు.. ఇంటింటికీ కృష్ణా నీళ్లు’ వచ్చాయి. ‘కృష్ణా నీళ్లు కావివి. కేసీఆర్ నీళ్లు. మా కన్నీళ్లు తుడిచిన నీళ్లు’ అంటున్న ఫ్లోరైడ్ ప్రభావిత జనాన్ని ఇప్పుడెట్లున్నారని పలుకరిస్తే కేసీఆర్‌కు శనార్తులు పలుకుతున్నారు!. మంచినీళ్లు అడిగిన నల్లగొండ ప్రజలకు రాజకీయం కొండంత హామీలిచ్చి, గోరంత ఊరట నిచ్చింది. ‘పథకాలు, శిలాఫకాలు, ప్రసంగాలు.. మా దప్పిక తీర్చవు. దోసెడు నీళ్లు కావాలె’ అని తెగేసి అడిగే తెలివిడినిచ్చింది తెలంగాణ ఉద్యమం. నల్లగొండ జనం దోసిలి పట్టి వేడుకొనుడు మాని, పిడికిళ్లెత్తి పోరాడిండ్రు. ‘జలసాధన’ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన ‘ఫ్లోరైడ్ విముక్తి పోరాటం’ తెలంగాణ ఉద్యమంతో చేయికలిపి, పల్లెపల్లెనా కదం తొక్కింది. కేసీఆర్ నడిచొచ్చిన ‘నల్లగొండ ఫ్లోరైడ్పై పోరుయాత్ర’కు ఫ్లోరైడ్ పీడిత పల్లెలన్నీ కలిసొచ్చాయి.
శాప విముక్తులు
నల్లగొండోళ్లకు ఫ్లోరోసిస్ అంతులేని విషాదం. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, చౌటుప్పల్, నారాయణపురం, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి, మల్లేపల్లి, డిండి, నేరెడుగొమ్ముతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతో కొంత మొత్తంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉంది. ఫ్లోరోసిస్ బాధితుల దీనగాథ అంతాఇంతా కాదు. ఒళ్లంతా కండరాలు పట్టేస్తాయి. వ్యవసాయం చేయాలంటే ఒళ్లు నొప్పులు. ఆ బాధకు మాత్రలు మింగి కిడ్నీలు పాడుచేసుకున్న వాళ్లు ఎందరో. ‘వాళ్లు మింగే నొప్పుల మాత్రలు..వాళ్ల కిడ్నీలను మింగేసినయ్’. ఆ మాత్రలకు డయాలసిస్ సెంటర్ల డాటాకు అందనంతమంది బలయ్యారు. ఫ్లోరోసిస్కి ఇంకెవరూ బలికారని కృష్ణా నీళ్లు ఇప్పుడు హామీ ఇస్తున్నాయి. ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉండే మర్రిగూడ మండలంలో ఆరేండ్లలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధించుకున్న తెలంగాణ సాకారమైందని చెప్పడానికి ఇంకేం కావాలి? ఇప్పుడు ‘నల్లగొండ జిల్లాలో పుట్టడం శాపం కాదు. ఒక వరం..కృష్ణా నీళ్లే మా బలం’ అంటున్నారు.
2007లో మర్రిగూడలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న కేసీఆర్.. ఐదు దోనలతండాలో భగీరథ నీటిని పట్టుకుంటున్న తండావాసులు
మంచిరోజులు మల్ల వచ్చినయ్
‘ఇంటింటికీ కృష్ణాజలాలు వచ్చిన తర్వాత కొత్త బాధితులు లేకపోవడమే కాదు. పాత బాధితుల ఆరోగ్యం కూడా మెరుగవుతున్నది’ అని మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మె డికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్‌కుమార్ చెప్పారు. ‘ఒకప్పుడు దవాఖానకు ఒళ్లు నొప్పులతో రో జుకు 30 మంది వస్తే, ఇప్పుడు 5-6 మంది రావడమే ఎక్కువ. మొదట్లో ఫిజియోథెరపీ చేయించుకున్న వాళ్లు మళ్లీ వారం, పది రోజులకే వచ్చేది. కానీ, కృష్ణా నీళ్లు తాగడం మొదలైన తర్వాత కండరాల నొప్పులు తగ్గాయి. ఫిజియోథెరపీ కోసం నెలన్నరకు, రెండు నెలలకొకసారి వస్తున్నార’ని ఆయన చెప్పారు.
నొప్పి లేని మందు
‘ఎండాకాలం ఫ్లోరైడ్ నీళ్లు తాగేవాళ్లకు మూ త్ర వ్యాధులొస్తే.. ఆల్కలైన్ సిట్రేట్, సిస్టోన్, నీరి సిరప్లని కొని తాగాల్సిందే. ‘ఈ సిరప్‌లను ఒకప్పుడు ఎండాకాలమొస్తే రోజుకు 30 అమ్మేది. కృష్ణా నీళ్లు వచ్చినంక పదిరోజులకు ఒకటి అమ్మ డం కష్టమే. ఒకప్పుడు నొప్పుల గోలీలే ఎక్కువ అమ్మినం. కృష్ణా నీళ్లొచ్చాక నొప్పి మాత్రలు, క్యాల్షియం మాత్రలకు గిరాకీ తగ్గింద’ని ఫ్లోరైడ్ పీడిత గ్రామం శివన్నగూడంలో మెడికల్ షాప్ నిర్వాహకుడు వూరె శ్రీనివాస్ చెబుతున్నాడు. ‘బిజినెస్ తగ్గితే బాధుంటది. కానీ ఈ బిజినెస్ తగ్గినందుకు నాకు సంతోషంగా ఉంద’ని మనసారా చెప్పారు ఆయన. కృష్ణా నీళ్లు తాగినప్పట్నుంచి మళ్లీ పనులకు పోతున్నామని కొందరు చెబుతున్నారు. ఫ్లోరోసిస్‌తో వలసపోయిన కుటుంబాలు, వదిలిపోయిన ఇండ్ల శిథిలాలు, ఫ్లోరోసిస్ పీడితుల ఆర్తనాదాలన్నీ నల్లగొండకు గతమే. ఇక భవిష్యత్ అంతా బంగారమే!
ఒక అమ్మ మాట..
నామాపురంలో గడ్డం కళమ్మ పొదుపు సం ఘాల్లో విలేజ్ బుక్ కీపర్. చుట్టుపక్కల ఊర్లకుపోయి పొదుపు సంఘాల మీటింగ్ పెట్టడం, రికార్డులు రాయడం ఆమె పని. కొన్నాళ్లకు నడవలేక, నిలబడలేకపోయింది. డాక్టర్లు ఫ్లోరోసిస్గా తేల్చారు. అప్పటికే భర్త చనిపోయిండు. ఏ పనీ చేయలేక మూడేండ్ల నుంచి మంచమే దిక్కయ్యింది. తల్లి కోసం కొడుకు చిన్న వయసులోనే హోటళ్లలో పనిచేస్తూ ఇంటికి పెద్దదిక్కయ్యిండు. కేసీఆర్ ఇస్తున్న 2,016 రూపాయల పింఛన్ ‘ఆసరా’ అవుతున్నది. ఆయన తెచ్చిన కృష్ణా నీళ్లు కడుపునింపుతున్నాయి. బోరుబాయి నీళ్లు తాగిన పాపానికి ఫ్లోరోసిస్ తనలాంటి తల్లులెందరో కన్న బంగారు కలలన్నీ కల్లలు చేసింది. మా బతుకులెట్లాగో ఆగమైనయి. ఈ కృష్ణా నీళ్లతో మా బిడ్డలనయినా కాపాడుకుంటామని కళమ్మ చెబుతున్నది.
కేసీఆర్ భరోసా..
స్కెలెటన్ ఫ్లోరోసిస్ బాధితులను చంటిపిల్ల ల్లా సాకే తల్లులకు చేతులెత్తి మొక్కాలి. ‘ఈ బిడ్డల్ని సాకడం భారం అనుకోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నం. ప్రభుత్వం నెలకు 3 వేల రూపాయల పింఛన్ ఇస్తున్నది. శివన్నగూడెంలోని అంశుల సత్యనారాయణ ఇంట్లో ముగ్గురు ఫ్లోరోసిస్ బాధితులే. ఎవరూ పనిచేయలేరు. తండ్రికి వృద్ధాప్య, కొడుక్కి వికలాంగుల పింఛన్ వస్తున్నది. తిండికి, బట్టకు, మం దులకు ఈ డబ్బులే కొండంత భరోసా’ అని కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.