నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌లో టీ-హబ్ ప్రాంతీ య కేంద్రాన్ని కూడా నెలకొల్పుతామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు రూపొందించే ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఇది దోహదపడుతుందన్నారు. ఐటీ ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సీఎం కేసీఆర్ కల అని చెప్పారు. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, నగరాల్లో ఐటీ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఐటీ హబ్‌లు ప్రారంభించుకున్నామని, త్వరలో నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. నల్లగొండలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.50 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్‌కు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏడాదిన్నరలో ఈ ఐటీ హబ్ సిద్ధమవుతుందని, ఇందులో 1,600 ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయని చెప్పారు. ఈ ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ఐటీ హబ్‌లు తోడ్పాటునందిస్తాయని తెలిపారు. నల్లగొండలో భవనం ప్రారంభం కాకముందే ఎన్ఆర్ఐలు ఉద్యోగాలు కల్పించాలనుకుంటే వారి కంపెనీల కోసం తాత్కాలిక వసతి కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఐటీ హబ్‌లోనే నైపుణ్య శిక్షణ కేంద్రం (టాస్క్) ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇక్కడే ప్రాంతీయ టీ హబ్ ఏర్పాటు చేస్తామని, తద్వారా కొత్తవారూ పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని చెప్పారు. రాష్ట్రంలో 2014-2015లో ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉంటే, నేడు రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు.
దేశంలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను సమదృష్టితో సమతుల్యతతో అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. పలు రాష్ర్టాల్లో కులమతాల పేరుతో పనికిమాలిన పంచాయితీలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన సవ్యంగా సాగుతున్నదనడానికి ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన సూచికలే నిదర్శనమని చెప్పారు. ఇటీవల ఆర్బీఐ విడుదలచేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికలో భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ఆర్థిక వ్యవస్థలో నాలుగో పెద్ద రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు నాలుగో చోదకశక్తిగా ఉన్న తెలంగాణ.. దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. ఆరున్నరేండ్లల్లోనే ఇతర పేద రాష్ట్రాలకు చేయూతనిచ్చే స్థాయికి ఎదగడం గర్వకారణం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా ఉమ్మడి నల్లగొండ అని, పంజాబ్‌ను మించి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కొన్ని రాష్ర్టాల్లో సీఎంలు పల్లెలకు, మరికొంతమంది పట్టణాలకు ప్రాధాన్యం ఇస్తుండగా.. తెలంగాణలో మాత్రం గ్రామాలు, పట్టణాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ ప్రభుత్వం నడుపని విధంగా పాలన సాగిస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రంలోని పట్టణాలకు, పల్లెలకు వేర్వేరుగా పదుల సంఖ్యలో వస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు.
‘ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ గొంతులు చించుకుంటున్నారు. రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారు.. వగల ప్రేమలు కురిపిస్తున్నారు.. ఇలాంటోళ్లు అప్పుడెందుకో కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోయారు’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నాడు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తే.. నేడు 24 గంటలపాటు ఉచిత్ విద్యుత్తు అందిస్తున్న ఘనత కేసీఆర్‌ది కాదా అని నిలదీశారు. ‘నల్లగొండ జిల్లాలో ఎత్తు, పొడవు ఉన్న నేతలంతా జిల్లాకు ఏమన్నా చేశారా? అంటే 60, 70 ఏండ్లు పాలించి చివరకు ఫ్లోరోసిస్ అనే దరిద్రాన్ని ఇచ్చారు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా లేదని కేంద్రం స్వయంగా పార్లమెంటులో ప్రకటించిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, జీ జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం నల్లగొండలో పర్యటించారు. మంత్రులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల బైక్‌లతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసి, అక్కడే ఎస్సీ, ఎస్టీ హాస్టల్ నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం బీట్ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.3.80 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు.
గతంలో ఐ అంటే టీ అంటే అర్థం తెల్వనోళ్లు ఐటీ మంత్రులుగా ఉండటంతోనే రాష్ట్రం వెనకబడిందని, కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యాక మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నేడు దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తున్నదని చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను సిగ్నల్ లేని నగరంగా మార్చేలా కేటీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఆ తరహా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ మంత్రులను ఇక్కడకు పంపారని, ఇక అభివృద్ధి ఆగదని చెప్పారు.
ఐటీ, పరిశ్రమల రంగాల్లో కొత్తగా 16 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ పరిధిలో 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇన్ని ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉన్నట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐటీ అనేది హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామీణ యువతకు కూడా అందాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఈ ఐటీ హబ్స్ ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ దొంగ ఉద్యోగ దీక్షలతో కొందరు నాటకాలు మొదలు పెట్టారని విమర్శించారు. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సత్యనారాయణ, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
స్థలం: వెల్కమ్ పాన్‌షాప్, క్లాక్‌టవర్ సెంటర్
కేటీఆర్: నీ పేరు?
యజమాని: సద్దాం హుస్సేన్
కేటీఆర్: ఇంట్లో మీరు ఎంతమంది? పిల్లలు ఏం చదువుతున్నారు?
యజమాని: ఆరుగురం సార్, పిల్లలు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్
కేటీఆర్: మీ అమ్మకు పెన్షన్ వస్తుందా?
యజమాని: వస్తుంది సార్. అప్పుడు 200 వచ్చేది ఇప్పుడు కేసీఆర్ 2000 ఇస్తున్నారు సార్.
కేటీఆర్: కరెంటు, నీళ్లు బాగానే ఉన్నాయా?
యజమాని: ఇప్పటికైతే బాగానే ఉన్నాయి సార్. ప్రాబ్లం ఏమీ లేదు
కేటీఆర్: నల్లగొండకు ఏం కావాలో తెలుసా?
యజమాని: పెద్ద రోడ్లు వేయాలి. ఐటీ తేవాలి. ట్యాంక్‌బండ్ కట్టాలి. షాపింగ్ మాల్స్ కట్టాలి. అప్పుడు మా లాంటోళ్లకు ఉపాధి దొరుకుతది.
కేటీఆర్: 18నెలల్లో ఐటీ హబ్ పూర్తవుతది. ఇక్కడి వాళ్లకే ఉద్యోగాలు వస్తాయి. నల్లగొండకు కావాల్సినవన్నీ చేస్తాం.
యజమాని: నా పాన్ తినాలి సార్. ఏం పాన్ ఇవ్వాలి? కలకత్తా స్వీట్ పాన్ బాగుంటది సార్.
కేటీఆర్: తప్పదా.. కలకత్తా స్వీట్ పానే ఇవ్వు. మా అన్న జగదీశన్నకు కూడా ఓ పాన్ ఇవ్వు.
యజమాని : ఇద్దరికీ పాన్ చేతికి అందించగా కేటీఆర్ 500 రూపాయలు చేతిలో పెట్టారు.
ఇలా మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు నల్లగొండ పట్టణంలో మధ్యాహ్నం ఎండలో గంటన్నరపాటు పాదయాత్ర చేసి.. ప్రజలను పలుకరిస్తూ సందడి చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిమ్మనగోటి రేణుక అనే యువతి కేటీఆర్‌కు ఎదురు రాగా.. ఏంటి సమస్య అని మంత్రి పలుకరించారు. బ్యాంకులో జాబ్ తీసేశారని చెప్పగా కలెక్టర్‌ను కలువాలని సూచించి ఆమె పేరును నోట్ చేయించారు.
నల్లగొండలో ఐటీ హబ్ ప్రారంభించిన రోజే ఇక్కడి యువతకు 1600 ఉద్యోగాలు కల్పించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. అమెరికాలోని ఆయా ప్రాంతాల నుంచి జూమ్ యాప్‌లో మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన పారిశ్రామికవేత్తలు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. దాదాపు 14 కంపెనీల ప్రతినిధులు నల్లగొండ ఐటీ హబ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించగా అందులో ఎనిమిది మంది జూమ్ యాప్‌లోకి వచ్చారు. ఆ ఎనిమిది మంది నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. అమెరికాలో నివాసం ఉంటూ హైదరాబాద్‌లో ఐటీ బ్రాంచీలను నిర్వహిస్తున్న జిల్లావాసి చిట్టిమల్ల రఘు 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. అలాగే విజయ్ 500 మందికి, శశిధర్‌రెడ్డి 150, సుధీర్ 50, కిరణ్ 50, అమర్‌రెడ్డి 100, అశోక్ 50, జగన్ 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. వారందరినీ కేటీఆర్ అభినందించారు.