కృష్ణ కాలనీ, జనవరి 7: అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారని భవన యాజమాని నాగుల దేవేందర్‌రెడ్డి ఆరోపించారు. త నకు రూ.40 లక్షల వరకు అద్దె రావాలని, అది చెల్లించిన తర్వాతే భవనం ఖాళీ చేయాలని దేవేందర్‌రెడ్డి కుటుంబంతోపాటు నిరసన తెలిపి, పాఠశాల ఫర్నిచర్‌ను వ్యానులో తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2021లో జిల్లా అధికారుల కోరిక మేరకు తన భవనాన్ని ప్రభుత్వ మైనార్టీ పాఠశాలకు అద్దెకు ఇచ్చానని తెలిపారు.
2027 వరకు లీగల్ అగ్రిమెంట్ ఉందని, అయినప్పటికీ అధికార పార్టీకి చెంది న కొంతమంది ప్రజాప్రతినిధులు భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు లేఖ కూడా ఇచ్చానని పేర్కొన్నారు. పూర్తి అద్దె చెల్లించిన తర్వాతనే భవనాన్ని ఖాళీ చేస్తామని డీఎండబ్ల్యూవో శైలజ హామీ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.
భవనంలోని పాఠశాల ఫర్నిచర్‌ను ఖాళీ చేయకుండా అడ్డుకున్నందుకు యాజమాని దేవేందర్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, నాగుల దేవేందర్‌రెడ్డి భవనానికి అద్దె చెల్లించాల్సిన మాట వాస్తవ మేనని డీఎండబ్ల్యూవో శైలజ తెలిపారు. విడుతల వారీగా చెల్లిస్తామని, ప్రిన్సిపల్ సెక్రటరీకి సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.