హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ఎట్టకేలకు తెలంగాణ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది డిసెంబర్ 31వరకేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పాటునుంచి సాగర్‌డ్యాం నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ పరిధిలో, శ్రీశైలం డ్యాం ఏపీ పరిధిలో కొనసాగుతున్నాయి. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఏపీ అధికారులు దౌర్జన్యంగా సాగర్డ్యాంపైకి దూసుకొచ్చి 13వ గేట్ వరకు, సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటరీని స్వాధీనం చేసుకున్నారు.
కేంద్రం జోక్యం చేసుకుని ఆయా చోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటుచేసింది. నాటి నుంచి తెలంగాణ అధికారులు, పోలీసులను అనుమతించడం లేదు. ఈ విషయమై కొంతకాలంగా డ్యాం అధికారులు అటు కేంద్రానికి, ఇటు కేఆర్ఎంబీకి లేఖలు రాస్తూ వచ్చారు. డ్యాం భద్రతను దృష్టిలో పెట్టుకుని పహారాకు తెలంగాణ అధికారులను అనుమతించాలని, ఈ మేరకు బోర్డుకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. దీంతో ఎట్టకేలకు కేఆర్ఎంబీ స్పందించి డ్యాంపైకి ఏఈఈల నుంచి సీఈ స్థాయి అధికారులతోపాటు.. మజ్దూర్లు, ఆపరేటర్లు, డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు మొత్తంగా 101 మంది సిబ్బందిని అంగీకరించింది.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మన్‌గా సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఏజీ)లెవెల్లో ఉన్న బీపీ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ గురువారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో బీపీ పాండేను చైర్మన్‌గా నియమించింది.