Nagarjuna | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘మంత్రి కొండా సురేఖ హద్దుదాటి మాట్లాడారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఆమె వ్యాఖ్యలతో మా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నది. మేం చిత్రపరిశ్రమకు చెందినంత మాత్రాన మాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మెతకగా ఉంటామని అనుకోవద్దు. మాకు సురేఖ క్షమాపణ చెప్పినా కేసును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు.. అసలు అలాంటి అవకాశమే లేదు. మంత్రి సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాజకీయ నాయకులు మమ్మల్ని దూషించకుండా ఒక గట్టి హెచ్చరికవుతుందని నేను ఆశిస్తున్నా’ అని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తేల్చిచెప్పారు.
‘నేను బలమైన వ్యక్తిని అని అనుకుంటున్నా.. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో నేను సింహాన్ని’ అని స్పష్టంచేశారు. ‘అదృష్టవశాత్తు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా మాకు అండగా నిలిచింది, ఇందుకు చిత్రపరిశ్రమకు ధన్యవాదాలు.. ఇది మా నాన్నగారి ఆశీర్వాదాలుగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. తన కుమారుడు నాగచైతన్య, ఆయన మాజీ భార్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున క్రిమినల్ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాగార్జున ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ టైమ్స్ నౌకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కొండా సురేఖ తీరుపై ఆయన ఫైర్ అయ్యారు.
ప్రశ్న : మంత్రి సురేఖపై కేసుపెట్టారు కదా.. ఆమె నుంచి మీరేం ఆశిస్తున్నారు?
నాగార్జున : మంత్రి సురేఖపై గురువారం క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు పరువునష్టం దావా వేశాం. ఆమెపై మరో వంద కోట్ల పరువునష్టం దావా వేయబోతున్నాం. కొండా సురేఖ హద్దుదాటి మాట్లాడారు. ఆమె మాటలు అస్సలు ఆమోదయోగ్యంకాదు. ఇప్పుడు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. సమంతకు క్షమాపణలు చెప్పారు. కానీ నా పరిస్థితి.. నా కుటుంబం పరిస్థితేంటి? నా కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నట్టు ఆమె ఒక్క మాటైనా అనలేదే?
ప్రశ్న : ఒకవేళ మంత్రి మీకు, మీ కుటుంబానికి క్షమాపణలు చెబితే పరువునష్టం దావాను ఉపసంహరించుకుంటారా?
నాగార్జున : కుదరదు. నా కుటుంబానికి క్షమాపణ చెప్పినా కేసును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు. ఆ అవకాశమేలేదు. ఇది వ్యక్తిగత విషయం కాదు. నన్ను, నా కుటుంబాన్ని దాటిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని చిన్నా పెద్దా అంతా మాకు మద్దతుగా నిలిచారు. మన వ్యవస్థకు సోకిన తెగులును అరికట్టే ప్రక్రియలో మేమున్నామని నేను భావిస్తున్నా. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను వాడుకోవడం సరికాదు. మేం చిత్రపరిశ్రమకు చెందినంత మాత్రాన మాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మెతకగా ఉండబోము. ఈ విషయంలో మంత్రి సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాజకీయ నాయకులు మమ్మల్ని దూషించేందుకు ఒక గట్టి హెచ్చరిక అవుతుందని నేను ఆశిస్తున్నా.
ప్రశ్న : మన దేశంలో చట్టపరమైన అంశాలు తెలుసుగా? ప్రత్యేకించి పరువునష్టం దావా కేసులు ఏండ్ల తరబడి సాగుతాయి?
నాగార్జున : అవును. నాకు తెలుసు. పూర్తి అవగాహన ఉన్నది. ఈ కేసులో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నా. అందుకే మేము క్రిమినల్ డిఫమేషన్ కేసు పెట్టాం. మేము వేగంగా తీర్పు ఆశిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోం. చట్టపరంగా చివరి వరకు పోరాడుతాం.
ప్రశ్న : ఈ సంవత్సరం మీకు సానుకూలంగా లేనట్టున్నది.
నాగార్జున : అవును. సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతూనే ఉన్నాయి. ఇదే చివరి సమస్య అని ప్రతిసారీ భావిస్తున్నా. కానీ, దేవుడు మరో విధంగా కష్టాల మీద కష్టాలు తెస్తున్నాడు. అయినా, నో ప్రాబ్లం. నేను ఎప్పుడూ బలమైన వ్యక్తిగా నిలబడ్డాను. నా కుటుంబాన్ని రక్షించడంలో నేను సింహంలా ఉంటా. అదృష్టవశాత్తు తెలుగు పరిశ్రమ మొత్తం మాతో నిలబడటానికి ముందుకొచ్చింది. ఇది నా నాన్నగారి మంచితనం, ప్రేమ, ఆశీస్సులు కావచ్చు.
ప్రశ్న : మీ మంచితనం, పరువు ప్రతిష్ఠ పరిస్థితి ఏమిటి?
నాగార్జున : ఆమె వ్యాఖ్యలతో మా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీడియా మాకు మద్దతుగా, అండగా నిలబడినందుకు ధన్యవాదాలు.