నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్3(నమస్తే తెలంగాణ) : ‘నాగార్జునసాగర్ ఎడమ కాల్వ తెగడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే. అందుకు రైతులు చూపిస్తున్న ఆధారాలే నిదర్శనం. ఖమ్మం జిల్లా మంత్రులు ఎండాకాలంలో సాగర్ నీళ్లు ఖమ్మంకు తరలిచేందుకు ఇక్కడి కాల్వ కట్టలపైన పోలీసులను పెట్టి ఎస్కేప్ చానళ్లకు, తూములకు వెల్డిండ్ టాకాలు వేశారు. దీంతో వరద ఉధృతి సమయంలో తూములు ఓపెన్ కాలేదు. ఎడమకాల్వ రెండుమూడు చోట్ల తెగింది. కాల్వ కట్ట తెగి వేలాది ఎకరాలు నీట మునిగింది..ఇందుకు ప్రభుత్వమే కారణం’ అని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆరోపించింది.
మంగళవారం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. నడిగూడెం మండలంలోని రామచంద్రాపురం సమీపంలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టకు పడిన గండ్లను పరిశీలించారు. కాల్వకట్టకు గండ్ల పడిన పరిణామాలను, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలిస్తూ రైతుల గోడు విన్నారు. అనంతరం కాల్వకట్టపైనే మీడియాతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వల్లనే నష్టం జరిగి ఉంటే ఆపత్కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇది స్పష్టంగా ప్రభుత్వం తన నిర్లక్ష్యంతో సృష్టించిన విలయమేనని విమర్శించారు. సాగర్ ఎడమకాల్వ గండ్లకు ఎస్కేప్ చానళ్లకు వెల్డింగ్ టాకాలు వేయించిన మంత్రులే కారణమని ఆరోపించారు. ఈ కాల్వ గండ్లకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరానికి రూ.50వేలు, దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.30వేల నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.