హైదరాబాద్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌లతోపాటు ఔట్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే గెజిట్‌ను జారీ చేశామని, అయితే వాటి నిర్వహణకు రూ.200 కోట్ల సీడ్మనీని డిపాజిట్ చేయాల్సి ఉన్నదని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రాజెక్టుల స్వాధీనానికి సిద్ధంగా ఉన్నామని ఆ అఫిడవిట్లో స్పష్టం చేసింది.
జలవిద్యుత్తు ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని గతంలో తెలంగాణ సర్కారు జీవో 34ను జారీ చేయడం, దానిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కారు కోర్టుకెక్కడం తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా ప్రాజెక్టుల అంశంపై అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రాజెక్టుల స్వాధీనానికి, నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, అందుకు సంబంధించి గెజిట్‌ను కూడా జారీ చేశామని, అయితే ఇరు రాష్ర్టాలు సీడ్మనీని చెల్లించాల్సి ఉన్నదని కోర్టుకు నివేదించింది.
నాగార్జునసాగర్ డ్యామ్‌ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకువచ్చే అంశాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా గాలికి వదిలేసినట్టు స్పష్టమవుతున్నది. ఆ డ్యామ్ 10 నెలల నుంచి సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలోనే ఉంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించకపోవడమే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుడు నవంబర్ 29న అర్ధరాత్రి వేళ ఏపీ సర్కారు అప్రజాస్వామికంగా సాయుధబలగాలతో సాగర్ డ్యామ్‌పైకి తరలివచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీని,13వ నంబర్ వరకు ఉన్న గేట్ల ను ఆక్రమించింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఈ ఘటనపై కొన్ని రోజులు హడావుడి చేసింది. సాగర్ డ్యామ్‌ను ఎట్టిపరిస్థితుల్లో బోర్డుకు అప్పగించబోమని, తిరిగి తెలంగాణ ఆధీనంలోకి తీసుకొస్తామని ప్రగల్భాలు పలికింది. ఆ తర్వాత అందుకు విరుద్ధంగా డ్యామ్‌తోపాటు పలు అవుట్లెట్ల ను అప్పగిస్తామని జనవరి 17న కేంద్ర జల్‌శక్తి శాఖ, ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ నిర్వహించిన సమావేశాల్లో అంగీకరించింది. దీనిపై తెలంగాణవాదులు, ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మాటమార్చిన కాంగ్రెస్ సర్కారు.. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేదిలేదని అసెంబ్లీలో తీర్మానం చేసింది. కంటితుడుపు చర్యగా కేంద్ర జల్‌శక్తిశాఖకు లేఖ రాసి చేతులు దులుపుకున్నది.
కేఆర్ఎంబీ ఆధీనంలో ఉన్న సాగర్ డ్యామ్ ఇప్పటికీ సీఆర్పీఎఫ్ నిఘాలోనే కొనసాగుతున్నది. డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టాలన్నా, ఇరు రాష్ర్టాల అధికారులను అనుమతించాల న్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని కేంద్రం గతంలోనే సీఆర్ఫీఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో బోర్డు నుంచి అనుమతిపత్రాన్ని తీసుకుంటేతప్ప డ్యామ్‌పైకి సీఆర్పీఎఫ్ ఎవరినీ అనుమతించడంలేదు. ఏపీ మాత్రం 13 గేట్లు, హెడ్ రెగ్యులేటరీ తమ ఆధీనంలో ఉంటాయని రోజుకో పేచీ పెడుతున్నది.
గత వేసవిలో సాగర్ టెయిల్‌పాండ్ నుంచి రాత్రికి రాత్రే 3 టీఎంసీల జలాలను తరలించుకుపోయిన ఏపీ.. బోర్డు అనుమతితో తెలంగాణ ఏ చిన్న పని చేపట్టినా మోకాలడ్డుతున్నది. డ్యామ్‌పై సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపుతో తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కారు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు చెందినవారే అయినప్పటికీ సాగర్ డ్యామ్‌ను తిరిగి తెలంగాణ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టకపోగా కనీసం ఆ అంశంపై మాట్లాడటం లేదు.
తిమ్మాపూర్, సెప్టెంబర్ 16: కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో సోమవారం ఉదయం ఎల్ఎండీ ఎస్ఈ రమేశ్ స్విచ్ ఆన్ చేసి 10, 11 నంబర్ గేట్లను ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువన మానేరు వాగులోకి వదిలారు. ఉదయం 9.30 గంటల సమయానికి ప్రారంభించిన గేట్లు 11 గంటలకే మూసివేశారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్ వద్ద వరద ప్రవాహం సోమవారం తగ్గుముఖం పట్టింది. బరాజ్ ఇన్‌ఫ్లో 1,75,430 క్యూసెక్కులు ఉండగా 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత ప్రవాహం రివర్ బెడ్ నుంచి 91.00 మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది.