Nagarjuna Sagar | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్ కుడి కాలువ హెడ్‌రెగ్యులేటరీ, కుడివైపు గేట్ల నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించేందుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. తమ ఆధీనంలోనే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న సీఆర్పీఎఫ్ బలగాల పహారాను డిసెంబర్ 30 వరకు పొడగించాలని నిర్ణయించారు. బోర్డు ఉద్యోగులకు చెల్లిస్తున్న ఇన్సెంటివ్స్‌పై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన సమావేశంలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్, తెలంగాణ ఈఎన్సీ అమ్జద్హుస్సేన్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ డ్యామ్ అంశంపై కూడా చర్చించారు.
వాస్తవంగా రాష్ట్ర ఏర్పాటు నుంచీ నాగార్జునసాగర్ డ్యామ్ తెలంగాణ నియంత్రణలో, శ్రీశైలం డ్యామ్ ఏపీ నియంత్రణలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులు, నీటి విడుదల పనులను ఆయా రాష్ర్టాలే పర్యవేక్షిస్తున్నాయి. వివాదం అనంతరం సాగర్ కుడివైపు హెడ్‌రెగ్యులేటరీ, గేట్ల నిర్వహణను ఏపీ రాష్ట్రమే కొనసాగిస్తున్నది. తాజా బోర్డు సమావేశంలో సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి, డ్యామ్‌ను స్వాధీనం చేయాలని తెలంగాణ కోరగా, అందుకు ఏపీ ఒప్పుకోలేదు. అంతేకాకుండా, డిసెంబర్ 30 వరకు డ్యామ్‌పై సీఆర్పీఎఫ్ బలగాలను కొనసాగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించింది. ఏపీ ప్రతిపాదనలకు బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ కూడా అంగీకరించారు.
బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు 25% ఇన్సెంటివ్స్ చెల్లించేవారు. అయితే స్పెషల్ ఇన్సెంటివ్స్ చెల్లింపు కేంద్ర సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని, దీనిని నిలిపేయాలని, గతంలో చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిని బోర్డు ఉద్యోగులు హైకోర్టులో సవాలు చేయగా, చెల్లించిన ఇన్సెంటివ్స్ను రికవరీ చేయవద్దని కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇన్సెంటివ్స్ను కొనసాగిస్తారా? లేదా? అనేది బోర్డే నిర్ణయించుకోవాలని స్పష్టంచేసింది. తాజా సమావేశంలో ఇన్సెంటివ్స్ను రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది.