నాగర్‌కర్నూల్, మే 3 : ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని మళ్లించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు ప్రజలు సమ్మతించరని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అన్యాయం చేసే విధంగా ప్రాజెక్టుల విషయంలో ప్రవర్తిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. డిండికి నీటి తరలింపు ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఈ నెల 1న పాలమూరు, ఎంజీకేఎల్ఐని మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సందర్శించడంపై ఆయన స్పందిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని చెప్పడం సంతోషమే.. అయినా ఏదుల నుంచి నీటి తరలింపును ఒప్పుకొనేదిలేదని తేల్చిచెప్పారు. అదనంగా 0.5 టీఎంసీలలు తీసుకెళ్లాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్లాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కెనాల్ ప్యాకేజీ-3లో సున్నపురాళ్ల తండా నుంచి కుడికిళ్ల వరకు మూడున్నర కిలోమీటర్ల మేర కెనాల్ అసంపూర్తిగా ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తే జూలై మొదటి వరకు కాల్వ ద్వారా నీటిని ఏదుల, వట్టెం, ఇతర రిజర్వాయర్లకు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ రిజర్వాయర్ల కింద ప్రధాన, చిన్న, పంట కాల్వలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. ఎంజీకేఎల్ఐలోని మరమ్మతులకు గురైన రెండు మోటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి కాల్వల సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.