Medak | మెదక్ : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు మైనంపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక కొత్త బస్టాండ్ వరకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. స్వార్థం కోసం మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నారని ఆరోపించారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి గ్రామాల్లో ఎలా తిరుగుతారో చూస్తామని మెదక్ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ నాయకులు, హవెలీ ఘనపూర్ మండల నాయకులు, రామాయంపేట మండల నాయకులు, నిజాంపేట మండల నాయకులు, పాపన్నపేట నాయకులు, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.