Vemula Prashanth Reddy | బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తాను తలపెట్టిన శాంతియుత ‘కఠోర నిరాహార దీక్ష’ను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ. 12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే 15వ తేదీన చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా, తనకు తాను శిక్ష వేసుకుంటూ అత్యంత శాంతియుతంగా ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఉదయం నిద్రలేవక ముందే, కనీసం స్నానం కూడా చేయకముందే వందలాది మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని, భీంగల్ లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి, ఫ్లెక్సీలను సైతం చించేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు.
ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అది చేతకాక, పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
తనను ఇంట్లో నిర్బంధించినా, పోలీస్ స్టేషన్ కు తరలించినా, లేదా జైల్లో పెట్టినా తన సత్యాగ్రహం, కఠోర నిరాహార దీక్ష ఎక్కడ ఉంటే అక్కడే కొనసాగుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువత, కుల సంఘాలు, వీడీసీ (VDC) సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ న్యాయమైన పోరాటానికి మరియు నిరాహార దీక్షకు మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.