మహబూబ్ నగర్ మే 30 : పట్టుదలతో చదివి నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలని, ఇందుకోసం రాత్రిపగలూ తేడా లేకుండా చదవాలని ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాల నియామకాలు చేసిన తరుణంలో ప్రతి నిరుద్యోగి తమకో ఉద్యోగం రావాలనే విధంగా కష్టపడి చదువుతున్నారని ఆయన తెలిపారు.
మహబూబ్ నగర్ ఎక్స్ పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ్రూప్స్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రావడంతోనే వారి కోసం ఉచిత కోచింగ్ సెంటర్, భోజన వసతి సౌకర్యాలు అందిస్తున్నామని వివరించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు. కోచింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని తెలియజేశారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కోచింగ్ అందుతున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా దగ్గర జంక్షన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధాన కూడళ్లలో జరగనున్న అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.