హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : క్రిమినల్ కేసుల్లో నిందితుల రిమాండ్ ఉత్తర్వులను జారీచేసేప్పుడు కింది కోర్టులు నిబంధనలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైదరాబాద్ మలక్‌పేట్‌లో నమోదైన కేసులో తనను జ్యుడీషీయల్ రిమాండ్‌కు పంపడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సోహైల్మంజిల్కు చెంది న క్యాబ్‌డ్రైవర్ సయ్యద్ దస్తగిరి దాఖ లు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కారాంజీ మంగళవారం విచారించారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించాకే రిమాండ్ ఆదేశాలివ్వాలని హైకోర్టు మేజిస్ట్రేట్ కోర్టులకు సూచించింది.
నిందితుడిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని తెలిపింది. తమ ముందున్న కేసులో నిందితుడిని అరెస్టు చేసి 24 గంటలు దాటిన తర్వాత (గంట ఇరవై నిమిషాలు ఆలస్యంగా) హాజరుపరిస్తే మేజిస్ట్రేట్ రిమాండ్ ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో పోలీసులు నిబంధనను పాటించలేదని ఆక్షేపించింది. ఏడేండ్లలోపు శిక్ష పడే కేసు ల్లో బీఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా పోలీసులు అమ లు చేయలేదని ఎత్తిచూపింది. ఇద్దరి పూచికత్తు, వ్యక్తిగత బాండ్ ట్రయల్ కోర్టులో సమర్పించాలని, పిటిషనర్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.