హైదరాబాద్: అతడు ముస్లిం. అయితేనేం.. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం గణేశ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. నవరాత్రులు ఆ గణనాథుని పూజల్లో కూడా పాల్గొంటున్నాడు. అతడే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిఖీ (Mohd Siddiqui). మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తున్న సిద్దిఖీ మతాలు వేరైనా మనుషలంతా ఒక్కటే అని చాటుతున్నాడు.
తాను గత 18 ఏండ్లుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాని సిద్దిఖీ చెప్పారు. అంతా ఒక్కటిగా కలిసి ఉండాలని కోరుకుంటానని తెలిపారు. తన హిందూ స్నేహితులు కూడా మసీదుకు వస్తారన్నారు.
తాము విగ్రహాన్ని పెట్టడానికి అన్ని అనుమతులు తీసుకున్నామని సిద్దిఖీ స్నేహితుడు వెంకటేశ్ శర్మ వెల్లడించారు. సిద్దిఖీ.. గణేశ్ విగ్రహం పెట్టడమేకాదు పూజల్లో కూడా పాల్గొంటాడని చెప్పారు. ఇక్కడ కుల మత బేధాలు పట్టించుకోమని అన్నారు. ఈనెల 9న ఏకదంతుడిని నిమజ్జనం చేస్తామని వెంకటేశ్ తెలిపారు.