Musi Victims | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేద ఎస్సీ కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ విచ్ఛిన్నం చేస్తున్నదని ఆరోపిస్తూ బాధితులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ నేతృత్వంలో వారు ఎస్సీ కమిషన్‌కు వెళ్లారు. ‘చట్టబద్ధంగా ఇండ్లు నిర్మించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తాగునీరు, విద్యుత్తు కనెక్షన్ ఇచ్చింది.
పన్నులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మావి అక్రమ నిర్మాణలని చెప్తున్నది’ అని బాధితులు పిటిషన్లో పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయడానికి ముందు సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి. కానీ సర్కార్ ఎలాంటి సర్వే చేయకుండా, బాధితుల అభిప్రాయాలు పట్టించుకోకుండా తమను తరలించడానికి యత్నిస్తున్నదని తెలిపారు. తమకు ప్ర త్యామ్నాయం చూపడం లేదని, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.