హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ)/రామంతపూర్ : ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో రూ.1600-1800కు విక్రయిస్తున్న ఇసుక మూసీ నదిలో తీస్తున్నదని, గోదావరి, కృష్ణా నదుల ఇసుకతో పోల్చితే ఇది నాసిరకంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నాసిరకం ఇసుకను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. మూసీ నది ఇసుకను తాము టన్ను రూ. 1200కే సరఫరా చేస్తామని అసోసియేషన్ నాయకులు సవాల్ చేశారు. నూతన ఇసుక విధానంపై సోమవారం ఉప్పల్లోని ఓ హోటల్లో ఇసుక లారీల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. దీనిపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇసుక ధరతోపాటు ప్రభుత్వ ఆదాయమూ పెరిగింది : టీజీఎండీసీ
ఇసుక ధర పెరిగి ప్రజలపై పడుతున్న భారం సంగతి ఎలావున్నా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని టీజీఎండీసీ పేర్కొంది. ‘టన్ను ఇసుక ధర రూ. 1800’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తకు స్పందిస్తూ, హైదరాబాద్లోని వివిధ ఇసుక అడ్డాల్లో ధర టన్నుకు రూ. 1900నుంచి రూ. 2200వరకు నడుస్తున్నదని అధికారులు అంగీకరించారు.