Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో అందులో గోదావరి నీళ్లు పారిస్తామని అంటున్నారని, కానీ అందులో పారేది పేద, మధ్య తరగతి ప్రజల రక్తమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారి ఎవరినీ కంటినిండా నిద్రపోనియ్యడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీ బాధితులు అధైర్య పడొద్దని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ధైర్యం చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు చెందిన వందలాదిమంది శనివారం తెలంగాణ భవన్‌కు వచ్చారు. హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి వారి బాధలు విని ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బుల్డోజర్ పాలన నడవదని దేశమంతా తిరుగుతూ చెప్తున్న రాహుల్‌గాంధీ తెలంగాణలో ఏం చెప్తారని ప్రశ్నించారు.
మూసీపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసీ బాధితుల బాధ అనుభవించే వారికే తెలుస్తుందని, రేవంత్‌రెడ్డికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. సీఎం తన సోదరుడికి 45 రోజుల సమయం ఇచ్చి, పేదల ఇండ్లను మాత్రం రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న గొప్ప పని సుందరీకరణ మాత్రమేనని చెప్పారు. ఏదైనా ఒక పని చేపడితే అది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగపడిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలకు నీళ్లు అందాయని గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి సుందరీకరణ పేరుతో వేల కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇండ్లు కట్టుకున్న వారికి రిజిస్ట్రేషన్ నుంచి విద్యుత్తు కనెక్షన్ వరకు అన్నింటికీ అనుమతులిచ్చి ఇప్పుడు కూల్చేస్తామంటే ఎలా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే వారికి అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు వాటిని కూలుస్తామనడం అన్యాయమని పేర్కొన్నారు. పేదలకు మేలుచేస్తే దీవెనలు ఇస్తారని, వారి ఉసురు తీస్తే శాపనార్థాలు పెడతారనే లాజిక్‌ను రేవంత్‌రెడ్డి మిస్సవుతున్నారని పేర్కొన్నారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మంచి పనికి ఉపయోగించాలని సూచించారు. ఈ మూర్ఖుడికి కూల్చడం తప్ప కట్టడం తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూల్చుడు, కేసులు, అక్రమాలు తప్ప పేదలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని పేర్కొన్నారు. తాను 2035 వరకు ఈఎంఐ కట్టాల్సి ఉన్నదని ఓ సోదరి చెప్పిందని, ఇల్లు కూలగొడితే ఈఎంఐ ఎలా కట్టాలని, కొత్త ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు, ఖర్చులు.. మొత్తంగా ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి, రూపాయి జమచేసి ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రే దానిని కూలగొడితే ఆ కుటుంబాలు ఏం కావాలని ప్రశ్నించారు.
కేసీఆర్ హైదరాబాద్ ఇమేజ్ను పెంచడంతో ఇక్కడికొచ్చి స్థిరపడితే పిల్లలు బాగుపడతారని ఎంతోమంది ఇక్కడికొచ్చి సెటిలయ్యారు. ఇప్పుడేమో ఎందుకొచ్చామా? అనే పరిస్థితికి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ పరిస్థితి మసకబారుతున్నది. తమను దొంగల్లా, కబ్జాకోరుల్లా చూపెడుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. బాధిత కుటుంబాలకు మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు.
-హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచితంగా, తలాతోక లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. నిజంగానే అభివృద్ధి చేయాలనుకుంటే అందుకు పేదల ఉసురు తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. పిల్లలకు కట్టించి ఇచ్చిన ఇండ్లు కూలగొడితే వారి పరిస్థితి ఏంటన్న బాధతోనే బుచ్చవ్వ ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఆమెది రేవంత్ చేసిన హత్య అని ఆరోపించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారని, ప్రభుత్వం తొలుత దానిపై దృష్టిసారించాలని హరీశ్‌రావు కోరారు. అసరా పింఛనును రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పారని, మహిళలకు 2500, రైతులకు 7500, యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, వీటి అమలు సంగతి చూడాలని పేర్కొన్నారు. పేదల ఇండ్లను కూలగొట్టుడు ఎందుకు? బడా కంపెనీలకు ఇచ్చుడు ఎందుకని ప్రశ్నించారు. పేదల ప్రాణాలు తీసి కంపెనీలు కడతావా? రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తావా? అని నిలదీశారు.
బుల్డోజర్ రాజ్ అంటూ హర్యానాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్‌గాంధీ తెలంగాణలో ఏం నడుస్తున్నదో తెలుసుకోవాలి. తెలంగాణలో నడుస్తున్నది కూడా బుల్డోజర్ రాజ్యమే. ఇక్కడి బుల్డోజర్లను ఆపకుండా మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానాలో బుల్డోజర్ రాజ్ నడవదంటే రాహుల్ మాటలను ప్రజలు ఎలా నమ్మాలి.
– హరీశ్‌రావు
మూసీలో ఉండే పేదలు అక్కడే చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతారని, వారికి ఎక్కడో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. తుగ్లక్ పనుల వల్ల ఒక కుటుంబం మొత్తం జీవనాధారం కోల్పోతుందని, ఒకే రోజు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులకు హైకోర్టు ద్వారా రక్షణ కల్పించేందుకు బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం ఉంటుందని, మూసీ బాధితుల తరుఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని హామీఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం మూసీ బాధితుల ప్రాంతాల్లో పర్యటిస్తుందని, బాధితులకు భరోసా కల్పిస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు.
బాధితులకు న్యాయపరంగా అందుబాటులో ఉంటామని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. పద్ధతిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రజలపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. బాధితులు ఫోన్ చేస్తే బుల్డోజర్ల కేంటే మేమే ముందు వస్తామని చెప్పారు. హైదర్షాకోటలో గల్లీగల్లీ తనకు తెలుసని, బీఆర్ఎస్ హయాం లో అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. తమను ఆక్రమణదారులని అనడంతో బాధితులు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
మూసీ బాధితుల పక్షాన ఉంటాం. బాధితులు ధైర్యం కోల్పోవద్దు, ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు, బఫర్ జోన్లో ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా చూస్తాం.
– హరీశ్‌రావు
‘మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నది. ఇష్టారీతిన పేదల ఇండ్లను కూల్చుతూ వారిని రోడ్డున పడేస్తున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం’ అని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ధ్వజమెత్తారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. హైడ్రా పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
మానాన్నది చిన్న కండక్టర్ ఉద్యోగం. మా మావయ్య రైల్వేలో చిన్న ఉద్యోగి. పైసాపైసా కూడబెట్టుకొని కార్పొరేషన్ నుంచి అన్ని అనుమతులు తీసుకొనే ఇల్లు కట్టుకున్నం. బ్యాంకు గూడా లోన్ మంజూరు చేసింది. ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రాత్రికిరాత్రే కూల్చేస్తామంటే ఎట్ల. మా బతుకులు ఏమైపోతయ్. అభివృద్ధి అంటే కింది నుంచి పైకి వెళ్లాలి. మరి ప్రభుత్వం మమల్ని పై నుంచి కిందకు తోసేస్తున్నది. ప్రభుత్వం ఆలోచించాలి. మాకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులకు పాదాభివందనాలు.
– శిరీష( గండిపేట)
నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతోనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నం. అన్ని పేపర్లు కరెక్ట్‌గా ఉన్నాయనే బ్యాంకు లోన్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఆక్రమణ దారులంటూ ట్యాగ్‌లైన్ వేస్తున్నది. ఇప్పుడు ఇల్లు కూలగొడితే మా పరిస్థితేంటి? మా పిల్లలకు మేము ఏం చెప్పుకోవాలి. వాళ్ల చదువులు ఏంగావాలె? గవర్నమెంట్ ఆలోచించి మమ్మల్ని కాపాడాలె.
– సిరిమా (హైదర్షాకోట)
మేం చట్టబద్ధంగా బండ్లగూడలో ఇల్లు కట్టుకున్నం. కానీ ఇప్పుడు మమ్మల్ని మూసీ ఆక్రమణదారులని ప్రభుత్వం ముద్రవేస్తున్నది. నిజంగా ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే నగర శివారు ప్రాంతంలో డెవలప్ చేయాలె. వికారాబాద్ దగ్గర కృష్ణా నది వద్ద బ్యూటిఫికేషన్ చేపట్టాలె. గుజరాత్‌లోకూడా ఇట్లనే జేసిన్రు. కానీ ఇక్కడి ప్రభుత్వం హైదరాబాద్ మధ్యలోని జనావాసా ప్రాంతాల్లో మూసీ బ్యూటీఫికేషన్ పేరిట ఆగం చేస్తున్నది.
– మహ్మద్ ఆయూబ్, హైదర్షాకోట (బండ్లగూడ)
మేం మూడు, నాలుగు నెలలుగా భయబ్రాంతులకు గురవుతున్నం. ఈ ప్రభుత్వం మా ఇంటిని కూలగొడతామని భయపెడుతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో గిట్ల లేకుండే. ఆయన అందరికీ మంచి జేసిండు. కానీ ఈ ప్రభుత్వం నిర్మించడం బంద్‌పెట్టి హైడ్రా తెచ్చి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఎక్కడో లండన్‌లోని థేమ్స్ నదిలెక్క మూసీని చేస్తామని చెబుతున్నది. అక్కడున్న జనాభా ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత? ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా దుర్మార్గంగా ముందుకెళ్తున్నది.
– రాజు, హైదర్షాకోట
మా అమ్మానాన్న అష్టకష్టాలు పడి ఇక్కడ ఇల్లు కట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా తెచ్చి ప్రజలను ఆగం జేస్తున్నడు. రాత్రికిరాత్రే ఇండ్లను కూల్చివేస్తూ పేద, మధ్యతరగతివాళ్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నడు. ఆరు గ్యారెంటీలను ఇవ్వకుండా తప్పుదోవపట్టిస్తున్నడు. అంటే ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే భక్షిస్తున్నరు. బీఆర్ఎస్ నాయకులు మాకు అండగా నిలువాలె.
– తేజస్వి, దత్తాత్రేయకాలనీ(సన్‌సిటీ)
మేం 27 ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నం. పైసాపైసా జమ చేసి, కొంత బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నం. మొన్ననే మా భర్త ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిండు. ఇగ సంతోషంగా ఉందామనుకున్న టైంలో ప్రభుత్వం ఇలా జేస్తే ఎలా? ఏండ్ల కింద కట్టుకున్న ఇండ్లను కూలగొడుతే మా బతుకులు ఏంగావాలె? గిట్లజేస్తే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతదా?.. ఇప్పుడన్న జెర ఆలోచించాలె.
-సరస్వతి(గండిపేట)
మేం ఎస్బీఐ, ఎల్ఐసీ లాంటి జాతీయ బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకొని ఇల్లుకట్టుకున్నం. వాళ్లు కూడా వెరిఫై చేసే లోన్ సాంక్షన్ చేసిన్రు. టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా ఇల్లు కట్టుకొనేందుకు పర్మిషన్ ఇచ్చిన్రు. ఇప్పుడు మేం తప్పుజేశామంటే వీరంతా తప్పుచేసినట్టే కదా? అయినా బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో కట్టారంటూ సామాన్యులను ఇబ్బందిపెడుతున్నది. మరీ సీఎం రేవంత్‌రెడ్డి అన్న కూడా చెరువులోనే ఇల్లు కట్టుకున్నడు కదా? ఆయనకేమో నోటిసులు ఇచ్చి సరిపెట్టిన్రు. అంటే సీఎం అన్నకు ఓ రూలు..మాలాంటి వారికి మరో రూలా?
– చైతన్యసూరి (సాయిరాం నగర్)
మాది ఈ రాష్ట్రం కాదు.. మా ఆయన మిలిటరీల పనిజేత్తడు. చాలా ఎండ్ల సంది హైదరాబాద్‌లోనే ఉంటున్నం. కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు సంతోషంగా ఉన్నం. మా కాలనీలో అన్ని సౌలత్లు చేసిండు..గిప్పుడు రేవంత్‌రెడ్డి మాత్రం ఇష్టమొచ్చినట్లు చేస్తున్నడు. మంచి, చెడూ చూడకుండానే ముందుకుపోతున్నడు. ఎప్పుడో కట్టుకున్న ఇల్లు బఫర్‌జోన్‌లో ఉన్నదంటూ అధికారులు అంటున్నరు. మా ఇంటిని కూల్చితే మేం ఎక్కడికి పోవాలె.
– అనితాభాయ్ (హైదర్షాకోట)