MGBS | హైదరాబాద్ : ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసీ వరద ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. జిల్లాల నుంచి బస్సులను ఎంజీబీఎస్ లోనికి రాకుండా మళ్లించారు. ఎంజీబీఎస్‌లో ఉన్న బస్సులను బయటకు పంపించేశారు. ప్రయాణికులను కూడా ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు.
వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించామని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్నగర్ వరకు, కర్నూల్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ వద్ద మళ్లిస్తున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్ వరకు అనుమతిస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లను మార్చామని సుఖేందర్ రెడ్డి తెలిపారు. రేపు మరో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారని చెప్పారు.