MLC Kavitha | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తేతెలంగాణ) : మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయలేదని మంత్రి శ్రీధర్‌బాబు సభకు తప్పుడు సమాచారమిచ్చారని ఆరోపించారు. ఆధారాలున్నాయని గట్టిగా అడిగితే ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించామని ఒప్పుకుంటూనే డీపీఆర్ రూపొందించలేదని మళ్లీ బుకాయించారని దుయ్యబట్టారు. ప్రపంచబ్యాంకు చీకటి కుట్రలు తెలుసుగనుకనే కేసీఆర్ పదేండ్లలో ఏనాడూ వరల్డ్‌బ్యాంకు నుంచి రుణం తీసుకోలేదని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణను ప్రపంచబ్యాంకుకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. మూసీ పరీవాహక ప్రాం తంలోని పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ కోసమని ప్రభుత్వం ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పేరిట వరల్డ్ బ్యాంకుకు డీపీఆర్ సమర్పించిందని చెప్పారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 19న సమర్పించిన డీపీఆర్ కాపీతో పాటు అక్టోబర్ 4న మ్యాన్ హార్ట్ కన్సల్టెన్సీ, కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా, ఆర్ఐవోఎస్ డిజైన్స్ సంస్థలతో కూడిన కన్సార్షియానికి రూ.165 కోట్లు విడుదల చేసిందని మీడియాకు కవిత ఆధారాలు చూపారు. ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, శంభీర్‌పూర్ రాజుతో కలిసి ఆమె బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్‌కు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చినా అది అవాస్తవమని సభలోనే మంత్రి శ్రీధర్‌బాబు కొట్టేయడం విడ్డూరమని, ఈ ప్రభుత్వం ఎందుకు అబద్ధాలు చెప్తున్నదని ప్రశ్నించారు. మూసీపై రూ.10 వేల కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రపంచ బ్యాంకుకు చెప్పిన ప్రభుత్వం, ప్రజలను మాత్రం తప్పుదోవపట్టిస్తున్నదని దుయ్యబట్టారు. మూసీ విషయంలోనే కాకుండా తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కవిత నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి ముసుగులో కాంగ్రెస్ మాతను తెచ్చిందని విమర్శించారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేదాకా పేదల తరఫున పోరాడుతామని స్పష్టంచేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ఏడాది కేంద్రం ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.2,819 కోట్లు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో చెప్పారని, మరీ ఇన్ని నిధులు వస్తే సర్పంచుల బిల్లులు ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం, గ్రామాలను అభివృద్ధి చేసిన చిన్న సర్పంచులను గోస పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంపై సభలో బీఆర్ఎస్ నిలదీస్తున్నా సర్కారులో చలనం లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో కేవలం రూ.500 కోట్లు గ్రామాలకు విడుదల చేసి మిగిలిన నిధులను దారి మళ్లించారని విమర్శించారు.
కేసీఆర్ తన పదేండ్ల పాలనలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తులను తెలంగాణ వైపు రాకుండా రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గుర్తుచేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ హైడ్రా, మూసీ విషయంలో ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతున్నదని విమర్శించారు. మూసీ డీపీఆర్‌ను ఇంకా సిద్ధం చేయలేదని చెప్తూనే ప్రపంచ బ్యాంకుకు రూ.4 వేల కోట్ల రుణం కావాలని దరఖాస్తు ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ లోపాయికారి ఒప్పందమని, మూసీ మాటున రియల్ ఎస్టేట్ దందా అనేది స్పష్టమవుతున్నదని, మూసీ ప్రక్షాళన అనేది కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూసీపై కేంద్రానికి ఓ మాట.. ప్రపంచ బ్యాంకుకు మరోమాట.. అసెంబ్లీకి ఇంకోమాట చెప్తున్నరు.. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేదాకా పేదల తరఫున పోరాడుతం. మూసీ పేరిట పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం, అత్యంత పవిత్రమైన అసెంబ్లీలో తప్పుడు సమాచారమివ్వడం దుర్మార్గం. సర్కారు వైఖరిని నిరసిస్తూ శాసనమండలిలో సభా హక్కుల నోటీసులు ఇచ్చినం. ఇప్పటికైనా సభకు వాస్తవాలు చెప్తుందని ఆశిస్తున్నం.
-ఎమ్మెల్సీ కవిత
మూసీ డీపీఆర్‌కు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చినా మంత్రి శ్రీధర్‌బాబు అది అవాస్తవమని సభలో ఎందుకు అబద్ధం చెప్తున్నరు? మూసీపై రూ.10 వేల కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రపంచ బ్యాంకుకు చెప్పిన ప్రభుత్వం, ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నది? ఇప్పటికే 16 వేల పేదల ఇండ్లకు మార్కింగ్ చేసి బుల్డోజర్లను పంపేందుకు సర్కార్ సిద్ధమైంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూలగొట్టే ఇండ్ల విషయం, ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు, ఇచ్చే పరిహారంపై విడమరిచి చెప్పాలి.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పంచాయతీల పెండింగ్ బిల్లులను ఇప్పించి తాజా మాజీ సర్పంచులను ఆదుకోవాలని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, నవీన్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం మండలిలో గుత్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. 2019-24 ఏండ్ల మధ్య ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు పంచాయతీల పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లక్ష్మీ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బిల్లులు బకాయి ఉన్నట్టు తెలిపారు. తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించేలా చొరవ తీసుకోవాలని మండలి చైర్మన్‌ను ఆయన కోరారు.
అత్యంత పవిత్రమైన అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మూసీ ప్రాజెక్టుపై తప్పుడు సమాచారం ఇవ్వడం దుర్మార్గమని కవిత మండిపడ్డారు. సర్కారు వైఖరిని నిరసిస్తూ శాసనమండలిలో సభా హక్కుల నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం సభకు వాస్తవాలు చెప్తుందని ఆశిస్తున్నామని, లేదంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.