HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 ( నమస్తే తెలంగాణ ): క్షణ క్షణం..భయం భయం.. మూసీ నిర్వాసితులు బస్తీల్లో అర్ధరాత్రి గస్తీకాస్తున్నారు. ఎటు నుంచి బుల్డోజర్లు వచ్చి తమ గూడుపైకి దూసుకొస్తాయో తెలియక హైరానా పడుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. రెండు రోజుల నుంచి కంటి మీద కునుకులేకుండా రాత్రుల్లో తమ ఇండ్లకు రక్షణగా నిలుస్తున్నారు. కార్వాన్, బహదూర్‌పుర పరిసర ప్రాంత ప్రజలు బృందాలుగా ఏర్పడి హైడ్రాను అడ్డుకోవడంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లు తెల్లవారుజాము కూల్చివేతలు ప్రారంభిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో వాళ్లంతా నిద్దురపోకుండా అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటువంటి దుస్థితి వస్తుందని తామెప్పుడూ ఊహించలేదని బాధితులు విస్మయం చెందుతున్నారు. శత్రుదేశాలపై యుద్ధం చేస్తున్నట్టుగానే రేవంత్ ప్రభుత్వం మా బతుకులపై దాడులు చేస్తుందని రహీం అనే స్థానికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చార్మినార్, అంబర్పేట్, కొత్తపేట, లంగర్‌హౌజ్ తదితర అన్నీ ప్రాంతాల్లో రాత్రి గస్తీ కాస్తూ తమ గూడు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మేం శత్రుదేశాలకు చెందినోళ్లం కాదు. మాపై అంత కక్ష ఎందుకు. మేం ఏం తప్పు చేశాం. మా ఇంట్లో పిల్లలు ఇల్లు ఎందుకు కూల్చేస్తారని అడుగుతున్నారు. బుల్డోజర్లు ఇండ్లను కూల్చేస్తాయని నెల రోజుల నుంచి నిద్దుర పోవడం లేదు. మా ఉసురు రేవంత్ సర్కార్‌కు తగులుద్ది.
హైడ్రా పేరు తలచుకుంటేనే భయం వేస్తోంది. ప్రజాపాలన అని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి పేదల మీదకు హైడ్రాను ఉసిగొల్పడం దారుణం. పేదల ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగుతుంది. మా ఇళ్లను కాపాడుకోవడానికి ప్రాణాలను లెక్క చేయం.
పిల్లాజెల్లా అంతా భయపడుతున్నారు. ఎవ్వరూ నిద్దురపోవడం లేదు. ఇన్నేండ్లు ఇక్కడే బతుకుతున్నాం. ఉన్నపళంగా వెళ్లిపొమ్మంటే ఎలా ? ఈ రాత్రుల్లో మాకు ఈ శిక్ష ఏందీ? హైడ్రా బుల్డోజర్లు వచ్చినా.. పోలీసులొచ్చినా భయపడం. ప్రాణం పోయినా సరే వాటిని అడ్డుకుంటాం. మా ఇండ్లను కూల్చనివ్వం.