శంషాబాద్ రూరల్, జూన్ 7 : వాట్సాప్ గ్రూపులో ఫొటోలు పెట్టవద్దన్నందుకు ఇద్దరు యువకులను బీజేపీ నాయకుడు రవి, అతడి అనుచరులు హత్యచేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మిడియాకు వివరించారు. కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోవిందాయిపల్లికి చెందిన జలగం రవి, గుండుబోయిన శివ, శేషగిరి శివ ముగ్గురూ కలిసి బీజేపీ అనుబంధ సంఘం బీజేవైఎంలో పని చేశారు. ముగ్గురి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు శివలు కాంగ్రెస్‌లో చేరారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. జీ శివ మియాపూర్‌లోని ఓ చికెన్ షాపు పనిచేస్తుండగా, శేషగిరి శివ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ నగరంలోని మీర్పేట్లో ఉంటున్నారు. ఈ నెల 4న జలగం రవి బటర్‌ఫ్లై సిటీ వెంచర్‌లోని విల్లాలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని ‘గోవిందాయిపల్లి వాట్సాప్ గ్రూపు’లో దాదాపు 300 ఫొటోలు పోస్టుచేశాడు. ఇద్దరు శివలు కలిసి ఈ గ్రూపులో ఇన్ని ఫొటోలు ఎందుకు అని కామెంట్స్ పెట్టడంతో పాటు గ్రూపులోంచి వాటిని డిలీట్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న రవి, అతడి అనుచరులు పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, గులుకుంట్ల విజయ్, ప్రవీణ్, వల్లెపు దాసు, జగదీష్గౌడ్తో కలిసి గాయత్రినగర్ చౌరస్తాలో ఉన్న ఇద్దరినీ గురువారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విల్లాకు తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి కత్తులతో పొడిచి చంపారు. మీడియా సమావేశంలో అడిషినల్ డీసీపీ రాంకుమార్, షాద్‌నగర్ ఏసీపీ రంగాస్వామి, కడ్తాల్ సీఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.