నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఇన్చార్జి కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. నిందితుడిని బుధవా రం ఉదయం చంచల్‌గూడ జైలునుంచి ఏసీ బీ కార్యాలయానికి తరలించనున్నారు. 27 వ తేదీ సాయంత్రం 5:30 గంటల్లోపు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చాలని అధికారులకు కోర్టు సూచించింది.
నిందితుడి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. నిందితుడి నివాసంతోపాటు 11 ప్రాంతా ల్లో సోదాలు నిర్వహించినట్టు పీపీ తెలిపారు. పీపీ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది. నిందితుడి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని, థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని కోర్టు నిబంధనలు విధించింది.