సూర్యాపేట/ హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): అడ్డగోలు వాగుడు.. పొంతనలేని మాట లు.. అర్థంపర్థం లేని చర్చలు.. రెచ్చగొట్టే చేష్ట లు.. బట్టకాల్చి మీదేసే నైజం.. ఎదుటి వారిని నమ్మించేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడే వారెవరంటే కచ్చితంగా బీజేపీ అనే సమాధానమే వస్తుంది. మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ ఆడిన నాటకాలు, చేసిన విన్యాసాలు.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా చేసిన విమర్శలు.. యాదగిరిగుట్ట సాక్షిగా చేసిన దొంగ ప్రమాణాలను ప్రజలు ఇప్పట్లో మర్చిపోరు. ‘మీ కోసమే రాజీనామా’ చేశానంటూ బీజేపీ అభ్యర్థి చేసిన దొంగ రోదనలను గుర్తించలేనంత అమాయకులం కాదంటూ మునుగోడు ప్రజానీకం బీజేపీ చెంప ఛెళ్లుమనిపించింది. బీజేపీ గూబగుయ్యిమనిపిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించారు.
మూడున్నరేండ్లు జనం ముఖం చూడక..
సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత మూడున్నరేండ్లలో ఏనాడూ జనం ముఖం చూడలేదు. తనను గెలిపించిన పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి కోవర్టుగా ఉంటూ కాంట్రాక్టుల కోసం ప్రయత్నించారు. తీరా రూ.18 వేల కోట్ల పనులు దక్కగానే రాజీనామా చేసి.. జనం కోసమే రాజీనామా చేశానని నమ్మబలకడాన్ని ప్రజలు గుర్తించారు. ఉప ఎన్నిక ప్రచారం కోసం గ్రామాలకు వచ్చిన సమయంలో నిరసనలు తెలిపిన జనంపైన బీజేపీ నాయకులను దాడులకు పురమాయించారు. వీటన్నింటినీ గమనించిన మునుగోడు ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తప్పుడు ప్రమాణాలతో కుట్రలు..
ఉప ఎన్నికలో బీజేపీ నీతీనియమాలు లేకుండా ప్రవర్తించి, ఓట్ల కోసం కుతంత్రాలకు పాల్పడింది. ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు మంత్రులు, నాయకులు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై దూషణలకు దిగటమే పనిగా పెట్టుకోవడాన్ని మునుగోడు తిరస్కరించింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో బీజేపీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా.. యాదగిరిగుట్టకు వెళ్లి ప్రమాణాలు చేసిన బండి సంజయ్ ప్రజల్లో ఓ జోకర్లా మిగిలారు. షిండేలను తీసుకొచ్చి బీజేపీ సీఎంను చేస్తామన్న ఆ పార్టీ అగ్ర నాయకులు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసి పట్టుబడి ప్రచారానికి ముఖం చాటేశారు.
ఈ మూడూ అనుమానమే..
ప్రస్తుతం బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక సాంకేతికంగా మిగిలింది ఇద్దరే. వచ్చే ఎన్నికల్లో వీరు కూడా గెలువడం అనుమానమే. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈట ల రాజేందర్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నా.. ఒక్క టి కూడా నెరవేరకపోవడంతో ప్రజలు వారిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి మోసం చేశారంటూ రఘునందన్‌రావును ఇటీవల రెండుసార్లు పార్టీ శ్రేణులే నిలదీశాయి. చావుబతుకుల్లో ఉండి ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదని, చనిపోయాక పరామర్శించడానికి వచ్చావా? అని దుమ్మెత్తిపోశారు. రాజాసింగ్ నోటి దురుసు సంగతి సరేసరి. మరోవైపు పార్టీలో బండి సంజయ్‌తో ఎవరికీ పొసగడం లేదు. ఏదో చేయాలనుకుని.. ఇంకేదో చేస్తూ బండి ఓ బఫూన్ స్థాయికి పడిపోయారు.
బీజేపీ ప్రధాన కార్యాలయం వెలవెల
మధ్యాహ్నమే వెళ్లిపోయిన బండి
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఫలితంతో రాష్ట్ర బీజేపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిం ది. ఆదివారం కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత మొదటి రౌండ్లోనే టీఆర్ఎస్కు మెజార్టీ రావడంతో బీజేపీ నేతలకు గొంతు లో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయ్యింది. రెండు, మూడో రౌండ్లో బీజేపీకి మెజార్టీ రావడంతో వెంటనే మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలుపెట్టారు. కానీ, ఆ తర్వాతి రౌండ్ నుంచి బీజేపీ మళ్లీ కోలుకోలేదు. చౌటుప్పల్‌లో తమకు భారీ మెజార్టీ వస్తుందని బీజేపీ నేతలు భావించారు. కానీ, అక్కడే చతికిల పడటంతో బండి సంజయ్, ఎంపీ కే లక్ష్మణ్ తదితర నేతలు కౌంటింగ్ పూర్తికాకముందే బీజేపీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఓటమిని ముం దే గుర్తించిన ఇతర నేతలు, కార్యకర్తలు ఆదివారం కనీసం ఆఫీస్ దిక్కుచూడలేదు. దీంతో మధ్యాహ్నానికే బీజేపీ ఆఫీస్ మూగబోయింది. సగం కౌంటింగ్ పూర్తికాకముందే వారు ఓటమిని అంగీకరించారు. రెండు రౌండ్ల కౌంటిం గ్ అనంతరం బండి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తీరు అనుమానాస్పదంగా ఉన్నదన్నారు. బీజేపీకి లీడ్ వచ్చి నా ఫలితాలు వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. రౌండ్ రౌండ్‌కు గ్రాఫ్ పడిపోతున్నా ఆ పార్టీ అనుకూల మీడియాలో మాత్రం బీజేపీకే లీడ్ వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ.. 10వ రౌండ్ తరువాత ఆ మీడియా చానళ్లు సైతం స్వరం మార్చాయి.
నల్లగొండలో ఖాతా తెరవకుండా
బీజేపీని తరిమికొట్టిన ప్రజానీకం
బీజేపీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దక్షిణ తెలంగాణలో విస్తరించాలనుకున్న ఆ పార్టీ ఆశలపై మునుగోడు ఓటమి నీళ్లు చల్లింది. చైతన్యవంత మునుగోడు ప్రజలు కమలం పార్టీని తరిమికొట్టారు. సొంత నేతలను కాదని కోటీశ్వరుడిని అరువు తెచ్చుకున్నా ఆదరించలేదు. గెలుపు కోసం కేంద్ర, రాష్ట్ర నేతలు ఎంత ఊదరగొట్టినా ఖాతా తెరవనివ్వలేదు. ఇతర పార్టీ నేతలను అడ్డగోలుగా కొనుగోలు చేసినా, ఉప ఎన్నికలో కోట్లు కుమ్మరించినా, మద్యం ఏరులై పారించినా ఆ పార్టీకి పరాభవం తప్పలేదు.
దక్షిణ తెలంగాణలో ఆశలు ఆవిరి
తెలంగాణలో బీజేపీ ప్రాబల్యమే లేదు. ఒకటి, రెండు చోట్ల మినహా ఎక్కడా తన ప్రభావాన్ని చూపలేదు. ఉత్తర తెలంగాణలో కాకతాళీయంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప పోరులో గెలించింది. దుబ్బాకలో జిమ్మిక్కులు, అసత్య ప్రచారాలతో.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ తెరవెనుక మద్దతు ఇవ్వడంతో బీజేపీ గట్టెక్కింది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని, ఇక దక్షిణాన తమ సత్తా చూపిస్తామని గొప్పగా ప్రచారం చేసుకున్నా.. నల్లగొండ జనం మాత్రం బీజేపీని తరిమికొట్టారు. రాష్ట్రమంతా ఏదో చేద్దామని కలలుగన్న కాషాయ పార్టీ ఆశలు ఆవిరైపోయాయి.