Komatireddy Raj Gopal Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ తనకు మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలే ముఖ్యమని.. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేశానని తెలిపారు.
నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారని.. తనను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని గుర్తుచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులు అందరూ ఓడిపోయినప్పటికీ.. మునుగోడు ప్రజలు మాత్రం తనను ఆశీర్వదించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా నైతిక విజయం తనదేనని చెప్పారు. అందుకే మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలు ముఖ్యమని భావించి, ఇక్కడి నుంచే పోటీ చేశానని స్పష్టం చేశారు.