హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడనున్నది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారం ముగియనున్నది. చివరి రోజు ఎన్నికల ప్రచారంతో మునుగోడు దద్దరిల్లిపోతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు మంత్రులు ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నారాయణపూర్ మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మునుగోడు పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలోని నాంపల్లి అంగడిబజార్‌లో ఉదయం 10.30 గంటలకు భారీ ర్యాలీని ప్రారంభించి, పాల్గొంటారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించే సభలో ప్రసంగించనున్నారు. చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చౌటుప్పల్‌లో శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారానికి వచ్చిన స్థానికేతులు ఉండకూడదని, నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల ప్రధానికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రతీ బూత్ నుంచి వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు.