Munnuru Kapu | హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ)/అంబర్‌పేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మున్నూరుకాపులను గుర్తించి, రెండుసార్లు మంత్రివర్గంలోకి తీసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని మున్నూరుకాపు సంఘం నేతలు తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మున్నూరుకాపులను అసలు పరిగణనలోకే తీసుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ అంబర్‌పేటలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు నివాసంలో వివిధ పార్టీలకు చెందిన మున్నూరుకాపు నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కే లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మాజీమంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు.
రాజకీయరంగంలో తమ వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని వాపోయారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ రాజకీయపార్టీలకు అతీతంగా మున్నూరుకాపుల గర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలపాలని నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. నాడు కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్, కే కేశవరావు, వీ హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలకు దకిన గౌరవం నేడు కాంగ్రెస్‌లో లేదని నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరుకాపు నేతలకు కీలక పదవులు ఇచ్చిందని, పార్టీకి విధేయతతో, సమర్థ్ధంగా పని చేశామని చెప్పారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ కూడా మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించారని గుర్తుచేసుకున్నట్టు సమాచారం. మున్నూరుకాపులకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం ఇదే తొలిసారి అని నేతలు ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఎంపీ, ఎమ్మె ల్యే, నామినేటెడ్ పదవులు కూడా తమకు తగిన స్థాయిలో ఇవ్వలేదని సంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల కోటాలో ఓ ఎమ్మెల్సీ పదవిని మున్నూరుకాపులకు ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమైనట్టు తెలిసింది.
తప్పుడు లెక్కలను ఎలా సమర్థిస్తాం!
సమావేశంలో కులగణనపైనా వాడీవేడి చర్చ జరిగింది. మున్నూరుకాపుల జనాభాను తక్కువగా చేసి చూపించిన తప్పులతడక లెక్కలను సవరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత తగ్గిస్తే.. తాము కూడా కాంగ్రెస్‌కు ప్రాధాన్యత తగ్గించటం అనివార్యం అని నేతలు తీర్మానించుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కులగణన సమర్థంగా చేసిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ పెడదామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిపాదించగా మిగతా నేతలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు తెలిసింది. అసంపూర్ణమైన కుల గణనతో మున్నూరుకాపుల సంఖ్య తగ్గించారని, ఇప్పుడు మనం కృతజ్ఞతా సభ పెడితే తప్పుడు లెక్కలను సమర్థించినట్టు అవుతుందని నేతలు వ్యతిరేకించినట్టు సమాచారం. అలాగే ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపించి, చేతులు దులుపుకోవద్దని, పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే వరకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కులగణన సరిగ్గా జరగలేదని, లెక్కలను సవరించాల్సిందేనని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా నేతలు పలు తీర్మానాలు చేశారు.
మున్నూరుకాపు నేతల తీర్మానాలు!