ఖైరతాబాద్, ఫిబ్రవరి 10: కులగణన సర్వే తప్పుల తడకపై మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధంకావాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వినతిపత్రాలు ఇవ్వాలని, 23న ఎమ్మెల్యేల ఇండ్ల ఎదుట నిరసనలు చేపట్టాలని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని కులగణన సర్వే తప్పులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మౌనం వీడాలని వారు డిమాండ్‌చేశారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ 2014లో 27 లక్షలుగా ఉన్న మున్నూరుకాపులు 2024 వచ్చేసరికి 13 లక్షలే ఉన్నట్టు ప్రభుత్వం కులగణన నివేదికలో పొందుపర్చినట్టు చెప్పిందని, ఆ లెక్కలు శుద్ధ తప్పులేనని విమర్శించారు. ప్రస్తుతం మున్నూరుకాపుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని, ప్రభుత్వ తప్పుడు లెక్కలను నిరసిస్తూ ఈ నెల 17, 23 తేదీల్లో జరిగే నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ విఠల్ మాట్లాడుతూ ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ దేశమంతా బీసీల సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఆయన నోటి ద్వారా వచ్చిన బీసీల సమగ్ర కులగణన తప్పుల తడకగా మారితే ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు.