ములుగు, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లికి చెంది న మైదం మహేశ్ (30) గతంలో ములుగు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పంచాయతీగా ఉన్న సమయంలో రెండు నెలల వేతనం, మున్సిపాలిటీగా మారిన తర్వాత మూడు నెలల వేతనం కలిపి మొత్తం ఐదు నెలల వేతనం రాలేదు. మహేశ్ మినహా మిగిలిన వారికి రెండు నెలల వేతనం ఇటీవల అందింది. తోటి కార్మికులకు వేతన చెల్లింపులు జరిగినా తనకు మాత్రమే ఎందుకు ఆగిందని మహేశ్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
మంగళవారం విధులకు హాజరైన ఆయన రాత్రి 7 గంటల వరకు మున్సిపాలిటీ వద్దే వేతనం కోసం వేచిచూసి ఇంటికి వెళ్లాడు. అధికారులను ఎంత వేడుకున్నా ఐదు నెలల వేతనం రాకపోవడం.. మరోవైపు కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతడిని ములుగు ప్రభుత్వ దవాఖానకు అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న మహేశ్ బుధవారం మృతి చెందాడు.