Property Tax | కృష్ణకాలనీ, మార్చి 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు ఓ గిరిజన కుటుంబంపై దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇంటి పన్ను కట్టలేదంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తలుపులు తీసుకెళ్లారు. 15 రోజురైనా తలుపులను తిరిగి ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ము లుగు జిల్లా రామచంద్రాపురానికి చెందిన హునానాయక్ 30 ఏండ్ల క్రితం కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లితండాకు వచ్చాడు. స్థానికంగా మేకల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం మున్సిపాలిటీ అధికారులు వచ్చి రూ.20 వేల ఇంటి పన్ను ఉన్నదని, రూ.5,500 కడితే చాలని, మిగతావి 6 నెలల తర్వాత కట్టవచ్చని చెప్పారు. దీంతో హునానాయక్ అప్పుతెచ్చి రూ. 5,500 కట్టాడు. కానీ శనివారం సిబ్బంది మళ్లీ వచ్చి మిగతా రూ.15 వేలు కట్టాలని ఒత్తిడి తెచ్చా రు. కొంత సమయం ఇవ్వాలని కోరగా, అందుకు ససేమిరాఅన్న సిబ్బంది ఇంటికి ఉన్న తలుపులు తీసుకుని వెళ్లారు.
అధికారులు మా ఇంటి తలుపులు పట్టుకెళ్లి, మా పరువు తీశారు. మాది నిరుపేద కుటుంబమని, ఒకసారిగా పన్ను డబ్బులు కట్టలేమని చెప్పినా వినిపించుకోలేదు. కొంత సమయం కావాలని వేడుకున్నా పట్టించుకోలేదు. మమ్మల్ని ఇష్టమొచ్చినట్టుగా దూషిస్తూ ఇంట్లోని సామాన్లు కిందపడేశారు, తలుపులు తీసుకెళ్లారు. మా పరిస్థితిని జిల్లా కలెక్టర్ అర్థం చేసుకుని, తలుపులు ఇ ప్పించాలి. లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ముందు పురుగులమం దు తాగి ఆత్మహత్య చేసుకుంటాం.