నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 13 : మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో వింతలు.. విశేషాలు చోటుచేసుకున్నాయి. భార్యాభర్తలు.. తల్లీకొడుకు, అత్తాకోడలు గెలుపొందడం, ఒక్క ఓటుతో విజయాన్ని ముద్దాడటం.. టాస్ ద్వారా గెలుపు తీరానికి చేరుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థలో దంపతులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. 58వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేకల సమ్మయ్య యాదవ్, 60వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆయన భార్య మేకల శారద విజయం సాధించారు. భార్యాభర్తలిద్దరూ పక్కపక్క డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపొందడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి భార్యాభర్తలు విజయం సాధించారు. ఒకటో వార్డు నుంచి గజవాడ లావణ్య, 7వ వార్డు నుంచి గజవాడ నాగరాజు విజయం సాధించారు.
మెదక్ మున్సిపాలిటీ తల్లీకొడుకు గెలిచారు. తల్లి దొంతి లక్ష్మి 14వ వార్డు నుంచి, కొడుకు దొంతి నరేశ్‌గౌడ్ 15వ వార్డు నుంచి విజయం సాధించారు. దొంతి లక్ష్మి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించింది.
నారాయణపేట పట్టణంలోని అత్తాకోడళ్లు గెలుపొందారు. ఒకరు బీజేపీ నుంచి, మరొకరు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 17వ వార్డు నుంచి బీజేపీ తరపున గెలుపొందిన కల్పనా రాఘవేందర్గౌడ్కు కోడలు వరసయ్యే శ్వేతా వెంకటేశ్‌గౌడ్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పంబల లలితాభిక్షపతికి అదృష్టం వరించింది. బీఆర్ఎస్ అభ్యర్థి లలితాభిక్షపతి, కాంగ్రెస్ అభ్యర్థి వంకమల్ల జ్యోతికి 253 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. ఎన్నికల సిబ్బంది రీకౌంటింగ్ చేయగా, ఇద్దరికి మళ్లీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో కౌంటింగ్ సిబ్బంది ఇద్దరి పేర్లపై చీటి వేసి డ్రా తీయగా, అదృష్టం బీఆర్ఎస్ అభ్యర్థి లలితాభిక్షపతిని వరించింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 3వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా బీఆర్ఎస్ అభ్యర్థి కంకనాల ఎల్లవ్వకు విజయం దక్కింది.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 3వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి బేగరి స్రవంతిపై కాంగ్రెస్ అభ్యర్థి కంజర్ల శ్రావణి ఒక్క ఓటు ఆధిక్యతతో గెలుపొందారు.
నారాయణపేట మున్సిపాలిటీలో ఒకే వార్డు నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కౌన్సిలర్లు గెలుపొందారు. 20వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున శ్వేతాగౌడ్ గెలుపొందగా, ఇదే వార్డు నుంచి మరో ముగ్గురు వివిధ వార్డుల్లో, వివిధ పార్టీల నుంచి పోటీ చేసి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 6, 17వ వార్డుల నుంచి మంజుల రాఘవేందర్‌రెడ్డి, కల్పన రఘురామయ్యగౌడ్ బీజేపీ నుంచి గెలుపొందారు. 18వ వార్డు నుంచి గొల్ల రవితేజ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 13 : కరీంనగర్ నగరపాలక సంస్థలో పలువురు నాయకులు తమ పట్టు కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్ ఎలా ఉన్నా, డివిజన్ల భౌగోళిక స్వరూపాలు మారినా తాము మాత్రం ప్రజలతోనే ఉన్నామని నిరూపించుకుంటున్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ప్రస్తుతం ఆరోసారి గెలిచి నగరపాలక సంస్థలో మళ్లీ అడుగు పెడుతున్నారు. 1995లో తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆయన అప్పటి నుంచి వివిధ డివిజన్లలో పోటీచేస్తూ ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా కార్పొరేటర్‌గా విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 58వ డివిజన్లో బరిలోకి దిగిన రవీందర్‌సింగ్ 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.