Municipal Elections | మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. నాయకులు టికెట్లు అమ్ముకున్నారంటూ పలుచోట్ల కార్యకర్తలు రోడ్డెక్కారు. అసలు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, వలస కాంగ్రెస్‌కు పెద్దపీట వేయడంతో హతాశులైన అనేకమంది పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు, పంచాయతీ ఎన్నికల ప్రజాతీర్పు తర్వాత కూడా తీరు మారని కాంగ్రెస్.. బీఆర్ఎస్పై దౌర్జన్యానికి తెగబడుతున్నది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రలోభాలకు దిగుతున్నది. పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. అంతర్గత కుమ్ములాటలకు దారి తీశాయి. పార్టీలో టికెట్ల కేటాయింపు, బీఫామ్‌ల అందజేతలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్త జ్వాలలు ఎగిశాయి. కొట్లాటలు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలతో కాంగ్రెస్ కార్యాలయాలు అట్టుడికిపోయాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసేందుకు పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మున్సిపల్ ఎన్నికలతో తారస్థాయికి చేరింది. వలస కాంగ్రెస్ నేతలకు బీఫామ్‌లు ఇస్తూ అసలు కాంగ్రెస్ నేతలకు మొండిచెయ్యి చూపడంపై ఆ వర్గం రగిలిపోతున్నది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, ఏండ్లుగా పార్టీ కోసం సేవ చేసిన తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా పలు జిల్లాల్లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. బీఫాంల అందజేతలో ట్విస్టులపై ట్విస్టులు నెలకొన్నాయి. తొలుత ఒకరికి బీఫాం ఇచ్చిన పార్టీ.. ఆ తర్వాత మరొకరికి కేటాయించింది. అదే విధంగా పలు చోట్ల ఒకే వార్డుకు ఇద్దరు అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది.
మున్సిపల్ టికెట్ల కేటాయింపు, బీఫాంల అందజేతలో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య అగ్గిరాజేసింది. అసలు కాంగ్రెస్ నేతలను పక్కనపెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై అసలు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలా జగిత్యాల, గద్వాల జిల్లాలో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జగిత్యాలలో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గానికి మొండిచెయ్యి చూపించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి పెద్దపీట వేయడంపై జీవన్‌రెడ్డి వర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గద్వాలలో ఇన్చార్జి సరితాయాదవ్ వర్గానికి తక్కువ వార్డులు కేటాయించి, ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గానికి అధిక సీట్లు కేటాయించడంతో సరిత వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
కాంగ్రెస్‌పై ఆ పార్టీ రెబల్స్ పంతం పట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తీరుతామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ పతనం ఈ ఎన్నికలతోనే మొదలైందంటూ హెచ్చరిస్తున్నారు. వలస వాదులను ఓడిస్తామని, పార్టీ గుర్తులు, బీఫాంలతో సంబంధంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బీఫాం రాని అసలు కాంగ్రెస్ నేతలు బరిలోనే ఉంటారని, వారిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. మానుకోట మున్సిపాలిటీలో టికెట్ ఆశించి భంగపడిన మాజీ కౌన్సిలర్ బుచ్చి వెంకన్న 13వ వార్డులో రెబల్‌గా పోటీ చేస్తానని, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తానని సవాల్ విసిరారు. జనగామ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని ఆ పార్టీ మైనారిటీ నాయకుడు అజార్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని జిన్నారం మున్సిపాలిటీ నేత నీలం లత స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ నాలుగో వార్డు స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. కాంగ్రెస్‌కు చెందిన నీలం లత కొన్నేండ్ల నుంచి కాంగ్రెస్ మహిళా నేతగా కొనసాగుతున్నారు. నాలుగో వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో నీలం లత టికెట్ ఆశించారు. అనూహ్యంగా పుట్టి విజయలక్ష్మికి కాంగ్రెస్ అధిష్ఠానం బీఫారం కేటాయించింది. దీంతో నీలం లత కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిన్నారంలో నామినేషన్ దాఖలు చేస్తున్న కార్యాలయం ముందు ఆమె బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నీలం లత మాట్లాడుతూ మహిళలకు కాంగ్రెస్‌లో గౌరవం లేదని, ఏండ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నా తనను గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులకు టికెట్ అమ్ముకొని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తీరుతో తనకు అన్యాయం జరిగిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని హెచ్చరించారు.
టికెట్ ఇస్తామని నమ్మించి తీరా తన పేరుపై ఉన్న బీఫాంను చించేసి ఇతరులకు కేటాయించి అవమానించారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పట్టణాధ్యక్షురాలు ఆదుర్తి హరిత కన్నీరు పెట్టుకున్నారు. 24వ వార్డుకు సంబంధించి ‘బీఫాం ఇస్తాం జగిత్యాలకు రావాలి’ అని ఉదయం ఫోన్లో సూచించడంతో వెళ్లానని, కానీ అక్కడ తన పేరుతో ఉన్న బీఫాంను జిల్లా అధ్యక్షుడు నందయ్య చించి వేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్‌ను నమ్ముకున్న కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో అధిష్ఠానం తీవ్ర అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ రాయికల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మ్యాకల రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏండ్ల నుంచి కష్టపడిన చాలా మందికి మున్సిపల్ టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని వాపోయారు. 9వ వార్డు నుంచి కాంగ్రెస్ యువజన శాఖ పట్టణాధ్యక్షుడు బత్తిని నాగరాజు, 5వ వార్డు నుంచి మహిళా కాంగ్రెస్ పట్టణాధ్యక్షురాలు తాటిపాముల మమత నామినేషన్ వేస్తే, వారికి బీఫాం ఇవ్వకుండా మొండిచెయ్యి చూపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు 2వ వార్డులో బీఫాం కేటాయించినా కార్యకర్తల ఆవేదన, కన్నీళ్లు చూసి తాను పోటీలో నిలబడనని ప్రకటించి, నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. బీఫాంల కేటాయింపులో అన్యాయంపై బత్తిని నాగరాజు, తాటిపాముల మమత పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్‌లో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. ఎంపీ మల్లురవి ప్రధాన అనుచరుడు తైలి శ్రీనివాసులుతోపాటు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి జగన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పదేండ్లుగా కాంగ్రెస్‌లో నిజాయితీగా పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశామని, అయినా తనకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో తనకు కాంగ్రెస్ బీఫాం ఇవ్వాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోరితే తనకు ఇవ్వకపోగా ఆర్థిక స్థోమత లేదంటూ తనను బాధపెట్టారని వాపోయాడు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ గెలుపుకోసం తాను ఎంతోకృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, నాగర్‌కర్నూల్ ఎంపీ, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ రాజకీయాలను ఒక కులానికే పరిమితం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా నామినేటెడ్ పోస్టులను పార్టీకి సంబంధం లేని వారికి కట్టబెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వార్డులో పార్టీకి సంబంధం లేని మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పార్టీ బీఫాం ఇచ్చారని చెప్పారు. వీరి అరాచకాలు, ఆగడాలు భరించలేక మనో వేదనతో పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
మానుకోట మున్సిపాలిటీలో నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బుచ్చి వెంకన్న ఆరోపించారు. పదేండ్ల నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నానని, గత మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డ్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచినట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే మురళీనాయక్ గెలుపు కోసం పని చేశానని, మున్సిపాలిటీ ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తానని చెప్పడంతో నామినేషన్ వేశానని చెప్పారు. తీరా ఇప్పుడు పార్టీ బీఫాం తనకు ఇవ్వలేదని వాపోయారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి (రూ.14 లక్షలు) డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని వారికి టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో అనేక సంవత్సరాలు పార్టీలో ఉన్నా.. తనను డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ, ఎమ్మెల్యే మురళీనాయక్ పట్టించుకోకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ బీ ఫాం ఇవ్వకున్నా 13వ వార్డులో రెబల్‌గా పోటీలో ఉంటానని స్పష్టంచేశారు.
జనగామ జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక, బీ ఫాం గొడవ కుమ్ములాటలకు దారితీసింది. మంగళవారం నామినేషన్ వేసిన అభ్యర్థుల తరఫున మున్సిపల్ కార్యాలయంలో బీ ఫాంలు సమర్పించే సందర్భంలో 11వ వార్డు నాయకులు, ఆశావహురాలు ఎనగందుల ఉపేంద్రతో కలిసి కాంగ్రెస్ జిల్లా కార్యాలయం, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ జెండాను నమ్ముకొని వార్డులో కష్టపడి ప్రజలకు సేవ చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని అలయెన్స్‌లో భాగంగా సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ కేటాయించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము కోరిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ మద్దతుతో నిలబెట్టిన సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వ్యవహార శైలిని నిరసిస్తూ జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట మాల మహాసభ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్, కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు అజార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన మాల సామాజిక వర్గంతోపాటు మైనార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో కొమ్మూరి మొండిచెయ్యి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు కంకణం కట్టుకున్న సీపీఎంకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకత్వానికి చేతులొచ్చాయి కానీ, పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన మాలలు, మైనారిటీలకు టికెట్ ఇవ్వడానికి మనసు రాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే జనగామలో పది మంది సీనియర్ నాయకులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
పార్టీ టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 53వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నాయకుడు, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని, ఆర్థికంగా నష్టపోయానని వాపోయారు. కార్పొరేషన్ పరిధిలోని 29, 53 డివిజన్లలో తనకు పోటీచేసే అవకాశం ఉన్నా నాయకులు పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని వారం క్రితం కొత్తగా చేరిన వారికి బీఫాం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్‌లో అసమ్మతి రాగం మొదలైంది. బీఫాం ఇవ్వకపోవడంతో మహిళా పట్టణాధ్యక్షురాలు వేముల పుష్పలత కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వార్డుల్లో తమకు పలుకుబడి ఉన్నదని, స్వతంత్రంగా బరిలో ఉండి, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రణవ్ వల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాశనమవుతున్నదని మండిపడ్డారు. అయనకు భజన చేసే వాళ్లకు మాత్రమే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చారని విమర్శించారు.
కొన్నేండ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారిని పక్కన పెడుతున్నారని, అనర్హులకు మున్సిపల్ ఎన్నికల్లో బీఫాంలు ఇస్తున్నారని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డిపై మండిపడ్డారు. తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దొంగలకు పార్టీ టికెట్లు ఇచ్చిందని, పార్టీని నమ్ముకున్న వారికి మొండిచెయ్యి చూపించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇచ్చారని అసహనం వ్యక్తంచేశారు. దాసరి కవితకు టికెట్టు ఇవ్వకుండా వంగ శాంత అనే మహిళకు కేటాయించడంతో కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ నిరసన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చే వరకూ క్యాంపు ఆఫీస్నుంచి వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి కౌన్సిలర్ టికెట్లను అమ్ముకున్నాడని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడేండ్లుగా కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడిన గడ్డం జ్యోతి మారుతిరెడ్డికి టికెట్ కేటాయించారని, పార్టీ కోసం పని చేసిన తన లాంటి వారిని విస్మరించారని వాపోయారు. వినయ్‌రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్‌లో బీఫాంల కుంపటి రాజుకున్నది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొన్న వారిని కాదని కొన్ని వార్డుల్లో కొత్త వారికి బీఫాంలు ఇచ్చారని పాత కాంగ్రెస్ నేతలు పలువురు కంట తడిపెట్టారు. కాంగ్రెస్‌ను నమ్ముకుని పని చేస్తే.. అన్యాయం చేశారని రాగి లక్ష్మి ఆవేదన చెందారు. పార్టీ కోసం పుస్తెలు అమ్ముకొని పని చేశామని, అయినా కనికరం రాలేదని కంట తడిపెట్టారు. 21లో ద్యారపోగు వెంకటేశ్ తనకు గతంలో ముగ్గురు పిల్లలు ఉండటంతో అవకాశం రాలేదని, ప్రస్తుతం ఆ నిబంధన లేకపోవడంతో పోటీ చేద్దామన్న ఆశతో ఉంటే అవకాశం ఇవ్వలేదని వాపోయాడు.

ఇంత చేసినా గౌరవం లేదు
దివంగత మాజీ ఎంపీ విఠల్‌రావుతో సన్నిహితంగా ఉండే మహదేవ్ కాలేకర్ తనను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. బ్యాంక్ మేనేజర్‌గా రిటైర్ అయ్యాక రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పారు. ఏండ్లుగా పార్టీలో కీలకంగా ఉన్నా.. కొద్దిరోజులుగా తనకు సరైన గౌరవం దక్కడం లేదని, అందుకే పార్టీని వీడినట్టు తెలిపారు.
అసంతృప్తుల రాజీనామా బాట
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్త కాంగ్రెస్ నేతలు రాజీనామా బాటపట్టారు. పార్టీ జెండా మోసిన వారిని కాదని, అప్పనంగా వచ్చిన వారిని అందలమెక్కించడంపై మండిపడుతున్నారు. ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు దక్కడం లేదని, అలాంటి పార్టీలో ఉండలేమంటూ రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తైలి శ్రీనివాస్ ప్రకటించారు. మరో నేత కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి జగన్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఇక బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీ 9వ వార్డు టికెట్ ఆశించిన యువజన శాఖ పట్టణాధ్యక్షుడు బత్తిని నాగరాజు, 5వ వార్డు టికెట్ ఆశించిన మహిళా కాంగ్రెస్ పట్టణాధ్యక్షురాలు తాటిపాముల మమత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ మెట్పల్లి పట్టణాధ్యక్షురాలు ఆదుర్తి హరిత తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
జగిత్యాలలో లొల్లిలొల్లి
జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల లొల్లి తారస్థాయికి చేరింది. మొత్తం 50 వార్డుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి వర్గానికి కేవలం 20 స్థానాలు ఇచ్చి, ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ వర్గానికి 30 సీట్లు కేటాయించడం సరికాదంటూ జీవన్‌రెడ్డి వర్గీయులు మంగళవారం ఆందోళన వ్యక్తంచేశారు. తీరా మధ్యాహ్నానికి జీవన్‌రెడ్డి వర్గానికి మరో ఐదు స్థానాలు కోతపెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జీవన్‌రెడ్డి ఇంటి వద్దకు తరలివచ్చి మీడియా సాక్షిగా ఎమ్మెల్యేను, ఎమ్మెల్యే వర్గీయులను, పార్టీ అధిష్ఠానాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని దుర్భాషలాడుతూ నిరసన వ్యక్తం చేశారు. బీఫామ్ రాని ఒరిజినల్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటారని, వారికి అండగా ఉంటానని జీవన్‌రెడ్డి ప్రకటించారు.
గద్వాలలో హైడ్రామా
గద్వాల కాంగ్రెస్‌లో నామినేషన్ల ప్రారంభం మొదలు, ఉపసంహరణ చివరి నిమిషం వరకు బీఫాంల విషయంలో హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మధ్య ఉన్న అంతర్గత విబేధాలు క్యాడర్‌ను అయోమయంలోకి నెట్టేసింది.గద్వాల మున్సిపాలిటీలో 36 వార్డుల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తాను బరిలో నిలిపిన అభ్యర్థులకు సంబంధించి బీఫాంలు ఇచ్చి ఆగమేఘాల మీద ఆర్వోకు అందజేశారు. మొత్తం 37 వార్డులకు గానూ ఎమ్మెల్యే వర్గానికి 30 వార్డులు, సరిత వర్గానికి 7 వార్డులకు బీ ఫాంలు కేటాయించింది. సరిత వర్గానికి చెందిన అభ్యర్థుల వార్డుల్లోనూ ఎమ్మెల్యే వర్గం అభ్యర్థులు బీఫాంలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడు వార్డుల్లో ఒకే పార్టీకి చెందిన ఇద్దరి బీఫాంలను తీసుకున్న అధికారులు ఎవరి బీఫాంను ధ్రువీకరిస్తారు? ఏ నిర్ణ యం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. అయితే తమను దెబ్బకొట్టేందుకు కావాలనే అభ్యర్థులను బరిలో నిలిపారని సరిత వర్గీయులు భగ్గుమంటున్నారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ నాలుగో వార్డు టికెట్ ఇస్తామని తనకు హామీ ఇచ్చి, నామినేషన్ వేసిన తర్వాత చివరి నిమిషంలో వేరే మహిళకు బీఫామ్ ఇవ్వడంపై మంగళవారం మండల పరిషత్ ఆఫీసు ఎదుట బైఠాయించి, కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్న నీలం లత

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి 16వ వార్డులో నామినేషన్ల ఉసంహరణకు చివరి రోజైన మంగళవారం.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గండమాల కృపానందంపై పోలీసుల ముందే బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ నాయకులు