హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24 లేదా 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎస్ఈసీ కమిషనర్ రాణికుముదిని రోజు రెండు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లు ఈ నెల 23వ తేదీతో ముగియనున్నాయి. దీంతో 24న షెడ్యూల్ జారీచేస్తారని ప్రచారం జరిగింది.
అదేరోజు షెడ్యూల్ జారీచేస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుండదు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో సైతం మంత్రులు ప్రసంగించడానికి అవకాశం ఉండదు. దీంతో 27న ఒకేసారి షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేయాలని ఎస్ఈసీ భావిస్తున్నట్టు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సర్వం సిద్ధంచేసింది. బుధవారం జిల్లాల మున్సిపల్ కమిషనర్లను కూడా బదిలీ చేశారు. ఇప్పటికే డివిజన్ల వారీగా ఫొటో ఓటరు జాబితా, బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధంచేశారు. మరోవైపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
ఇంకోవైపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎస్ఈసీ కమిషనర్ రాణికుముదిని వరుసగా జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్‌బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది నియామకం తదితర వివరాలు తెలుసుకున్నారు. పక్కాగా ఏర్పాట్లు చేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.