భైంసా, మే, 22 : లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన రాధేశ్యామ్ భైంసా-నిర్మల్ రోడ్డులో 2022 సంవత్సరంలో కమర్షియల్ భవన నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ శాఖ అనుమతి తీసుకుని ఆస్తి పన్ను కూడా చెల్లించారు. సదరు భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ కమిషనర్ ఈనెల 16న నోటీసు జారీ చేశారు. రూ.30 వేలు లంచం ఇవ్వాలని బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ద్వారా డిమాండ్ చేయించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం పథకం ప్రకారం.. రాధేశ్యామ్ బిల్ కలెక్టర్ విద్యాసాగర్‌కు రూ.30 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.