గజ్వేల్ అర్బన్, ఆగస్టు 30: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ సీఎంగా రాష్ర్టానికి అందిస్తామని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన గజ్వేల్ నియోజకవర్గాన్ని, గజ్వేల్ పట్టణాన్ని వందేండ్లకు సరిపడా అభివృద్ధి చేసిన ఘతన సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యంతో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడమే కాకుండా అన్ని విధాలుగా ఆదర్శవంతంగా మారినట్టు తెలిపారు. కేసీఆర్‌ను గెలిపించుకోవడానికి నాయకులకంటే ముందు ప్రజలే వస్తారని అన్నారు. అన్ని కుల,మతాలను సమంగా చూసే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.