మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 10: లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్టర్ పిట్ల యాదయ్య వివిధ పనులు చేయించారు. సీసీ రోడ్లకు సంబంధించి రూ.5 లక్షలు, వివిధ జంక్షన్లలో లైట్ల ఏర్పాటుకు సంబంధించి రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షల పనులు చేపట్టారు.
ఈ బిల్లులు మంజూరు చేయాలని మున్సిపల్ ఏఈ పృథ్వీని సంప్రదించగా.. రూ.70 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ.50 వేల వరకు ఒప్పందం కుదిరింది. డబ్బులు ఇస్తానని కాంట్రాక్టర్ ఏఈ పృథ్వీకి శనివారం ఫోన్ చేశారు. అతను సూచించిన చోటుకు వెళ్లి రోడ్డు పక్కన రూ.50 వేలు అందిస్తుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. పృథ్వీపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.