ముంబై : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌ను మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ఆరంభించింది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ వేదికగా ఆఖరి బంతివరకూ ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. ముంబై నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లకు 157/7 చేసింది. నదైన్ డి క్లెర్క్ (44 బంతుల్లో 63*, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌తో పాటు బంతి (4/26)తోనూ రాణించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. సజీవన్ సజనా (25 బంతుల్లో 45, 7 ఫోర్లు, 1 సిక్స్), నికోల కేరీ (29 బంతుల్లో 40, 4 ఫోర్లు) ఆదుకోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది.
స్వల్ప ఛేదనను ధాటిగా ప్రారంభించిన బెంగళూరు.. 4 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. హారీస్, కెప్టెన్ స్మృతి బౌండరీలతో విరుచుకుపడటంతో ఆ జట్టు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ 4వ ఓవర్లో ఇస్మాయిల్.. స్మృతిని ఔట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికింది. ఐదో ఓవర్లో సీవర్.. హారీస్‌ను ఔట్ చేయగా హేమలత (7)ను అమన్‌జ్యోత్ వెనక్కిపంపింది. 8వ ఓవర్లో బంతినందుకున్న కెర్.. రాధా యాదవ్(1)తో పాటు రిచా ఘోష్ (6)నూ ఔట్ చేసి బెంగళూరును దెబ్బకొట్టింది. 7.4 ఓవర్లలో 65/5గా ఉన్న ఆర్సీబీని అరుంధతి (20), డి క్లెర్క్ ఆదుకున్నారు. 6వ వికెట్‌కు ఈ జోడీ 52 రన్స్ జోడించి బెంగళూరును విజయం వైపు నడిపించింది. విజయానికి 37 పరుగుల దూరంలో అరుంధతి నిష్క్రమించడంతో ఆ జట్టు మళ్లీ తడబడింది. ఆఖరి 6 బంతుల్లో 18 రన్స్ అవసరముండగా క్లెర్క్.. 6, 4, 6, 4తో ఆ జట్టుకు విజయాన్ని అందించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ కెర్ (4)తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ సీవర్ బ్రంట్ (4) నిరాశపరిచినా కమిలిని (28 బంతుల్లో 32, 5 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 20, 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడే యత్నం చేశారు. కానీ ఈ ఇద్దరి నిష్క్రమణతో 67/4గా ఉన్న ముంబైని కేరీ, సజనా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 49 బంతుల్లోనే 82 రన్స్ జతచేసిన ఈ జోడీ ముంబైకి పోరాడగలిగే స్కోరును అందించింది.
ముంబై: 20 ఓవర్లలో 154/6 (సజనా 45, కేరీ 40, క్లెర్క్ 4/26, బెల్ 1/14);
బెంగళూరు: 20 ఓవర్లలో 157/7 (నదైన్ 63*, హారీస్ 25, కేరీ 2/35, కెర్ 2/13)