పినపాక, జనవరి 9 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో జాతీయ స్థాయి అండర్-17 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల మూడో రోజైన శుక్రవారం తెలంగాణ టీమ్ 56-33తో బీహార్‌పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన తెలంగాణ..బీహార్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. మిగతా మ్యాచ్‌ల్లో ఏపీ టీమ్ 59-37తో మణిపూర్‌పై, సీబీఎస్ఈ 54-29తో పుదుచ్చేరిపై, మధ్యప్రదేశ్ 44-42తో ఒడిశాపై, జమ్మూకశ్మీర్ 96-33తో కర్ణాటకపై, మహారాష్ట్ర 77-46తో సీబీఎస్ఈపై, రాజస్థాన్ 38-37తో చత్తీస్‌గఢ్‌పై గెలిచాయి. పోటీలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ హాజరయ్యారు.