న్యూఢిల్లీ, జనవరి 9: ఇరాన్ అగ్నిగుండంలా మారింది. సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేక నిరసనలతో దేశం అట్టుడుకుతున్నది. రాజకీయ, ఆర్థిక మార్పులు డిమాండు చేస్తూ ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో గురువారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. భద్రతా దళాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 45 మంది మరణించినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తాసంస్థ నెట్‌బ్లాక్స్ తెలిపింది. ప్రవాసంలో ఉన్న ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు రేజా పహ్లావీ నిరసనలకు పిలుపునిచ్చిన సమయంలోనే ఇంటర్నెట్ బ్లాక్ఔట్ జరగడం గమనార్హం.దేశంలో గతంలో ఎన్నడూ లేనంత ఉధృతంగా జరుగుతున్న నిరసనలతో దేశ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీకి పదవీచ్యుతి తప్పదని ఊహాగానాలు సాగుతున్నాయి. అంతేగాక ఖమేనీ దేశం విడిచి రష్యా పారిపోతారని వార్తలు వస్తున్నాయి.
దేశంలో కొనసాగుతున్న నిరసనలపై ఖమేనీ శుక్రవారం మొదటిసారి స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులకు ఇరానియన్ల రక్తపు మరకలు అంటుకున్నాయని, ఆయనను సంతోషపెట్టేందుకే నిరసనకారులు తమ సొంత ఆస్తులను తామే నాశనం చేసుకుంటున్నారని ఖమేనీ మండిపడ్డారు. దేశంలో హింసను రెచ్చగొడుతున్న నిరసనల వెనుక విదేశీ ఏజెంట్లు ఉన్నారని ఖమేనీ ఆరోపించారు. విదేశీ శక్తుల కుయుక్తులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
కాగా, జవనరి 31లోగా ఖమేనీ నాయకత్వం నుంచి ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుందంటూ ఇన్వెస్టోపీడియా అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ శుక్రవారం జోస్యం చెప్పింది. ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం కావడంతో ప్రజల్లో ఆందోళనలు తలెత్తి డిసెంబర్ 28 నుంచి దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని టెహ్రాన్‌లో బజార్లు మూతపడడంతో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.

‘ఈ ప్రభుత్వానికి తాను భయపడనని, గత 47 ఏండ్లుగా జీవచ్ఛవంలా బతుకుతున్నా’ అని నిరసనలో పాల్గొన్న ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇరానియన్-అమెరికన్ జర్నలిస్టు మసిహ్ అలీనేజాద్ ఒకరు పంచుకున్న ఈ వీడియోలో ఒక మహిళ నోటి నుంచి రక్తం కారుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేస్తూ కన్పించింది. ఇస్లామిక్ రిపబ్లిక్‌తో విసిగిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక మహిళ గొంతు ఇదని మసిహ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇరాన్‌ను 50 ఏండ్లకు పైగా పాలించిన పహ్లావీ రాజవంశానికి వారసుడైన రేజా పహ్లావీ ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రేజా పహ్లావీ, మహారాణి ఫరా దిబాల కుమారుడు. 1960 అక్టోబర్ 31న జన్మించిన రేజాకు 1967లో తన తండ్రి పట్టాభిషేక సమయంలో యువరాజుగా అధికారిక గుర్తింపు లభించింది. 1978లో అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో యుద్ధ విమానంలో శిక్షణ పొందేందుకు రేజా వెళ్లారు. కొన్ని నెలల తర్వాత ఇస్లామిక్ విప్లవంలో ఇరాన్ రాజు పదవీచ్యుతులయ్యారు.
ఇరాన్లో ప్రజస్వామ్యం ఏర్పడి నాయకుడిగా ఖమేనీ బాధ్యతలు చేపట్టడానికి ముందే పహ్లావీ రాజకుటుంబం దేశాన్ని విడిచి పారిపోయింది. అప్పటి నుంచి రేజా పహ్లావీ ప్రవాస జీవితాన్ని గడుపుతూ ఇరాన్‌కు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇరాన్‌కు తిరిగిరావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ప్రజలకు సాయం చేసేందుకు జోక్యం చేసుకోవాలని ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు.