న్యూఢిల్లీ, జనవరి 9: తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఐ-ప్యాక్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరపడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై శుక్రవారం విరుచుకుపడ్డారు. తనపైన, తన ప్రభుత్వంపైన ఓ స్థాయికి మించి ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టవలసి వస్తుందని మమత హెచ్చరించారు. ఈడీ దాడులను నిరసిస్తూ కోల్‌కతాలో శుక్రవారం జరిగిన ప్రదర్శననుద్దేశించి మమత ప్రసంగిస్తూ నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి. నా పదవిపైన ఉన్న గౌరవంతో ఇప్పటివరకూ మౌనంగా ఉన్నాను. నా సహనాన్ని పరీక్షించకండి. మీ గుట్టంతా బయటపెడతా. దాన్ని చూసి యావద్దేశం షాకయిపోతుంది అంటూ అమిత్ షాను ఉద్దేశించి హెచ్చరించారు.
పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేస్తున్న అక్రమ బొగ్గు గని కేసుకు సంబంధించి ఐ-ప్యాక్ కార్యాలయం, సంస్థ అధిపతి ప్రతీక్ జైన్ కార్యాలయంపైన గురువారం ఈడీ దాడులు నిర్వహించింది. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో పోలీసులు, ఇతర అధికారులను వెంటపెట్టుకుని ఆ రెండు కార్యాలయాలకు వెళ్లిన మమతా బెనర్జీ కొన్ని ఫైళ్లు, పెన్ డ్రైవ్‌లతో బయటకు రావడం ఉద్రిక్తతకు దారి తీసింది. తన పార్టీకి చెందిన ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన కీలక వివరాలు ఈ ఫైళ్లలో ఉన్నట్లు మమత వెల్లడించారు.
ఈడీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడంపై వస్తున్న విమర్శలను మమత ప్రస్తావిస్తూ సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులను అడ్డుకుని తానేమీ తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. పార్టీ అధినేత్రి హోదాలో తాను అక్కడికి వెళ్లానని, మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో తన పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఈడీ నుంచి కాపాడుకోవలసిన హక్కు తనకు ఉందని ఆమె చెప్పారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ సొమ్మంతా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకే వెళ్లిందని ఆమె ఆరోపించారు. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ద్వారా ఈ డబ్బు చేతులు మారిందని ఆమె చెప్పారు.
జగన్నాథ్ సర్కార్‌ని బందిపోటుగా పేర్కొన్న మమత బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారిని గద్దార్గా, అమిత్‌షాకు దేవుడిచ్చిన కొత్త కొడుకుగా అభివర్ణించారు. బొగ్గు స్మగ్లింగ్‌ను అడ్డుకోవడంలో విఫలమైన బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్కు బొగ్గు కుంభకోణంలో ఉన్న పాత్ర ఏమిటని ఆమె అమిత్ షాని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తనపైన, తన ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణానికి సంబంధించి అమిత్ షా పాత్రను ఆధారాలతోసహా బయటపెడతానని, తన వద్ద సాక్ష్యాలుగా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని మమత హెచ్చరించారు.
ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులను నిరసిస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆమె తన బలనిరూపణకు అవకాశంగా ఈ ర్యాలీని ఉపయోగించుకున్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నదంటూ నినాదాలు చేస్తూ 8బీ బస్టాండు నుంచి హజ్రా మోర్ వరకు మమతతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు.
ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులకు సంబంధించి కేసుల విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు పరస్పరం తోసుకోవడంతో కోర్టు హాలులో గందరగోళం ఏర్పడి విచారణ ప్రారంభం కావడానికి ముందే న్యాయమూర్తి కోర్టు హాలు నుంచి వాకౌట్ చేశారు. న్యాయమూర్తి జస్టిస్ సువ్రా ఘోష్ పదేపదే హెచ్చరించినప్పటికీ కోర్టు హాలులో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో న్యాయవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.
ఈ కేసుతో సంబంధం లేని న్యాయవాదులు ఐదు నిమిషాల్లో కోర్టు హాలును ఖాళీ చేయాలని, లేనిపక్షంలో తానే వెళ్లిపోతానని ఆమె హెచ్చరించారు. ఎవరు కోర్టు హాలులో ఉండాలో, ఎవరు వెళ్లిపోవాలో తేల్చుకోలేక న్యాయవాదులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. తన హెచ్చరికలను సైతం న్యాయవాదులు ఖాతరు చేయకపోవడంతో న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను జనవరి 14వ తేదీకి వాయిదా వేసి కోర్టు హాలు నుంచి నిష్క్రమించారు. దీంతో ఈడీ, తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన రెండు కేసుల విచారణ జనవరి 14వ తేదీకి వాయిదా పడింది.