ములుగు, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు. ములుగు జిల్లాలోని స్వగ్రామం మల్లంపల్లిలో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఎంపీలు సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ములుగుకు చేరుకొని, అక్కడినుంచి రోడ్డు మార్గంలో మల్లంపల్లికి చేరుకొన్న కేటీఆర్.. జగదీశ్వర్ మృతదేహంపై పార్టీ జెండా కప్పి, నివాళులర్పించారు. జగదీశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి చెందేవరకు రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్ అప్పగించిన ప్రతీ పనిని విజయవంతం చేయడంలో ఒక సైనికుడిలా పనిచేసిన కుసుమ జగదీశ్వర్ మంచి నేతగా ఎదిగారని కొనియాడారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో తనతోపాటు చురుగ్గా పాల్గొన్న జగదీశ్వర్ హఠాన్మరణం చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఆయన అకాల మరణం పార్టీతోపాటు ములుగు ప్రజానీకానికి తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపునందుకొని ప్రాణాలకు సైతం తెగించి వీరోచితంగా, ధీరోదాత్తంగా జగదీశ్వర్ పోరాడారని గుర్తుచేసుకున్నారు. జగదీశ్వర్ కుటుంబానికి తనతోపాటు కేసీఆర్ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దగ్గరుండి అంత్యక్రియలు జరిపించిన శ్రేణులు
జగదీశ్వర్ మృతిచెందిన విషయం తెలియగానే మల్లంపల్లికి చేరుకొన్న రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం నుంచి మొదలుకొని సోమవారం జగదీశ్వర్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జగదీశ్వర్ అంత్యక్రియల్లో ఎలాంటి లోపాలు జరుగకుండా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శ్రెడ్డి చూసుకొన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పీవీ ప్రభాకర్‌రావు, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, తాతా మధు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, సీతక్క, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు, కార్పొరేషన్ చైర్మన్లు ఏరువ సతీశ్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మేడె రాజీవ్‌సాగర్, జడ్పీ చైర్పర్సన్లు గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, సంపత్‌రెడ్డి, ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతితోపాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జగదీశ్వర్ భౌతికకాయానికి మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత స్నానం చేయించగా.. అంతిమయాత్రలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ పాడె మోసి తమ ఉద్యమ, పార్టీ సహచరుడి రుణం తీర్చుకొన్నారు. కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి పార్టీతోపాటు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ములుగు జిల్లాతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని జగదీశ్వర్‌కు తుది వీడ్కోలు
పలికారు.