హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజలాంఛనాలతో సీతారాములు ఉత్తర ద్వారం వద్దకు వేంచేశారు. ఏడు వారాల నగలతో సీతారాములను అర్చకులు అలంకరించారు. గరుడ వాహనంపై రామయ్య, గజ వాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు.
కాగా, కరోనా నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. ఉత్తరద్వార దర్శనం, తిరువీధి సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 6.49 గంటలకు స్వామివారు ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చారు. క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు.
ఇక వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడులకు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ దృష్ట్యా ఆలయంలో ఆంక్షలు విధించారు. దీంతో స్వామివారి పల్లకి సేవ, ఉత్తర ద్వార దర్శనం, పెద్దసేవను ఏకాంతంగా నిర్వహించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరించారు. అయితే ఉదయం 9 గంటల తర్వాత భక్తులకు సాధారణ దర్శనాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. యోగ, ఉగ్ర నరసింహస్వామి, వేంకటేశ్వర స్వామికి అర్చకులు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామివార్లకు పుష్ప వేదికపై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన కల్యాణంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉన్న పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఉత్తరద్వారం ద్వారా భక్తులు వేంకటేశ్వరుని దర్శించుకుంటున్నారు.
కాగా, కరోనా దృష్ట్యా పలు ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఆలయాల్లో దర్శన ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆలయాల్లో వైకుంఠ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు.