రామగిరి, జూలై 06: మొహర్రం (Muharram) పండుగ పురస్కరించుకొని మండలంలోని గ్రామాల్లో పీరీల ఊరేగింపులతో (Peerla Panduga) సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆయా గ్రామాల్లో పీరీల ఊరేగింపు ప్రారంభించి ఇంటింటికి సందర్శన చేస్తుండగా.. భక్తులు పిరిలకు దట్టీలు, కుడకల పేరులు, కట్న కానుకలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిభక్తి శ్రద్ధలతో తమ మెక్కులు తీర్చుకుంటున్నారు. హిందూ ముస్లింలు ఒక్కటిగా జరుపుకునే పీరీల పండుగ వైభవంగా జరుగు తుండగా ఇదే రోజు రాత్రి పీరీల నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్లో తొలి నెల, కొత్త సంవత్సర ప్రారంభానికి సూచిక. మొహర్రం మాసం 10వ రోజున వచ్చే రోజుని అషురా అని పిలుస్తారు. ఇది విషాదానికి, సంతాపానికి చెందినది. రాచరిక వ్యవస్థ నశించి ప్రజాస్వామ్య పాలన రావాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త మనుమలైన హసన్, హుస్సేన్లు కర్బలా మైదానంలో యుద్ధం చేసి కుటుంబ సభ్యులు, అనుచరులతో సహా వీరమరణం పొందుతారు. వారి త్యాగనిరతిని, అమరత్వాన్ని స్మరిస్తూ ముస్లింలు మొహర్రంను జరుపుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. పేదలకు సాయం చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. అధర్మం, అన్యాయాలను వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుబడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని ప్రార్థిస్తారు.