మహమ్మద్ అలీ జిన్నా 1919 ఏప్రిల్లో ఓ కేసులో వాదించేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్పటికే జాతీయ నాయకునిగా ఆయనకు మంచి పేరుంది. ఆయన రాక సందర్భంగా నగరంలోని పెద్దలు ఓ ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ సంగతి తెలిసిన నిజాం సర్కారు ఉలికిపాటుకు గురైంది. స్థానిక సీఐడీ అధికారి వెంకట్రామారెడ్డిని జిన్నా వద్దకు పంపింది. ముందుగా ఆ ఆధికారి ఉపన్యాసం ఇవ్వరాదని సూచించాడు. జిన్నా లిఖిత ఆదేశాలకోసం అడిగితే తన మాటే ఆదేశంగా తీసుకోవాలన్నాడు. కానీ జిన్నా అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ అధికారి కనీసం రాజకీయ అంశాలపై మాట్లాడరాదని చెప్పి వెళ్లిపోయాడు.
జిన్నా ‘రేపటి భారతం‘అనే అంశంపై ప్రసంగించారు. బ్రిటిష్ ఇండియాలోని ప్రజలు సంస్థానాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారని, సంస్థానాల పాలకులు బికనేర్ మహారాజాను ఆదర్శంగా తీసుకోవాలని జిన్నా తన ప్రసంగంలో పరోక్షంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో సంస్థానాలు క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సంగతి తెలుసుకున్న సర్కారు హైదరాబాద్ రాజ్యంలో జిన్నా ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ మేరకు 1919 ఏప్రిల్ 19న జిన్నా బొంబాయి చిరునామాకు లేఖ వెళ్లింది. ఇంకెప్పడూ సంస్థానం పొలిమేరల్లోకి అడుగుపెట్టొద్దని దాని సారాంశం.