యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి, పవిత్రమాల ధారణలతో అర్చకులు పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను నవ కలశాలతో స్వప్న తిరుమం జన జరిపి దివ్య మనోహరంగా అలంకరించారు. యాగశాలలో స్వామి, అమ్మవార్లను అదిష్టింపజేసి పంచసూక్త, మూల మంత్ర హోమ పూజలు, మహాపూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు.
108 నూలు పోగులతో తయారు చేసిన మాలలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వయంభువులకు, బాలాలయంలోని అలంకారమూర్తుల చెంత పూజలు చేసి స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఈ పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు రంగాచార్యులు, నరసింహామూర్తి, కిరణ్‌కుమారాచార్యులు, లక్ష్మణాచార్యులు నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
పాతగుట్టలో..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వయంభూవులకు పవిత్రమాల ధారణతో ఉత్సవాలకు ముగింపు పలికారు. యాగశాలలో మూలమంత్ర హవనం జరిపి మహా పూర్ణాహుతిని నిర్వహించారు.