హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. ముద్రగడ కుటుంబసభ్యులు బుధవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. ముద్రగడ అంత్యక్రియల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముద్రగడ పాడె మోసిన జగన్.. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే ఉన్నారు. మరణానికి ముందే ముద్రగడ తన కుటుంబసభ్యులకు ఓ లేఖ రాశారు. ఇంటి ఆవరణలోనే తన పార్థివదేహాన్ని ఖననం చేయాలని, ప్రభుత్వ లాంఛనాలు, పోలీసుల గౌరవ వందనం తనకు అవసరం లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. తాను మరణించాక తన భార్య పుణ్యస్త్రీగానే ఉండాలని పేర్కొన్నారు. తనకు అధికార లాంఛనాలు వద్దని ముద్రగడ స్పష్టం చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ పేర్కొన్నప్పటికీ పోలీసులు తుపాకులతో రావడం ఏంటని ప్రశ్నించారు. ముద్రగడ చనిపోయిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు.